Hyderabad Musi Floods 2025: భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. వరదల తాకిడితో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ బ్రిడ్జి వద్ద మూసీ ఏకంగా 13 అడుగుల ఎత్తుతో పొంగిపొర్లుతుండటంతో జనజీవనం అతలాకుతలం అయిపోయింది. గడిచిన 30 ఏళ్లలో మూసీకి ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి అని అధికారులు వెల్లడించారు.
మూసీకి వరద తాకిడి హైదరాబాద్ నగరవాసులను అల్లకల్లోలం చేస్తోంది. పలు ప్రాంతాల్లో ఆలయాలు మునిగిపోగా.. పురానాపూల్ దగ్గర ఓ శివాలయంలో పూజారి కుటుంబం వరద నీటిలో చిక్కుకుపోయింది. తమను ఆదుకోవాలని బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైడ్రా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది వారికి అల్పాహారం అందించారు. అనంతరం వారిని బయటికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు ఎంజీబీఎస్ బస్టాండ్‌కు వెళ్లే రెండు వంతెనల పైనుంచి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. ఆ బస్టాండును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. చాదర్‌ఘాట్ వద్ద చిన్నవంతెనపై వరద తీవ్ర రూపం దాల్చడంతో ఆ వంతెనపై నుంచి రాకపోకలు ఆగిపోయాయి. దాంతో పెద్ద వంతెన పైనుంచే రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా చాదర్ఘాట్పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/brd-mla-harish-rao-fire-on-congress-over-hyderabad-floods/
ఇదిలా ఉండగా మూసారాంబాగ్ వద్ద మూసీ ఉగ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో అంబర్‌పేట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. మూసారాంబాగ్ పాత వంతెనపై 10 అడుగుల మేర వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నిర్మాణంలో ఉన్న వంతెనను కూడా తాకుతూ వరద ప్రవహిస్తోంది. ఫలితంగా వరద నీటిలో కొత్త వంతెన నిర్మాణ సామగ్రి కొట్టుకుపోయింది.


