Hyderabad rave party bust : హైటెక్ నగరంలో డ్రగ్స్ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. గచ్చిబౌలిలోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్ వేదికగా సాగుతున్న రేవ్ పార్టీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. యువతీ యువకులు కలిసి డ్రగ్స్ తీసుకుంటుండగా మెరుపుదాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ మత్తు భాగోతం వెనుక ఓ ప్రభుత్వ అధికారి, ఏకంగా ఓ డిప్యూటీ తహసీల్దార్ హస్తం ఉన్నట్లు తేలడం సంచలనం సృష్టిస్తోంది. అసలు ఎవరీ డిప్యూటీ తహసీల్దార్? బెంగళూరు, గోవాలతో ఈ పార్టీకి ఉన్న లింకులేంటి? పక్కా సమాచారంతో పోలీసులు ఈ ముఠాను ఎలా పట్టుకున్నారు?
అపార్ట్‌మెంట్‌లో అర్థరాత్రి ఆపరేషన్ : కొండాపూర్‌లోని రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు గచ్చిబౌలి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసులతో కలిసి ప్రత్యేక ‘ఈగల్ టీమ్’ రంగంలోకి దిగింది. ఆదివారం రాత్రి అపార్ట్‌మెంట్‌పై సంయుక్తంగా దాడి చేసి, మత్తులో జోగుతున్న యువతి సహా ఏడుగురు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల ఎండీఎంఏ, 8 గ్రాముల డ్రగ్ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో తేజ, విక్రమ్ (తూర్పు గోదావరి), నీలిమ, పురుషోత్తం రెడ్డి, భార్గవ్ (హైదరాబాద్), చందన్, రాహుల్ (బెంగళూరు) ఉన్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు.
కీలక సూత్రధారి.. ప్రభుత్వ అధికారి : ఈ కేసు విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మత్తు దందా వెనుక రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గోవా, రాజమహేంద్రవరంలోని తన ఫామ్‌హౌస్‌లో తరచూ రేవ్ పార్టీలు నిర్వహించే మణిదీప్‌కు బెంగుళూరుకు చెందిన డ్రగ్స్ సరఫరాదారుడు రాహుల్‌తో సంబంధాలున్నాయని తేలింది.
“2024 నూతన సంవత్సర వేడుకల కోసం మణిదీప్ గోవాలో రేవ్ పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీకి తేజ, నీలిమలను ఆహ్వానించి, వారికి డ్రగ్స్ అలవాటు చేశాడు. ప్రస్తుతం మణిదీప్ పరారీలో ఉన్నాడు, అతడిని పట్టుకునేందుకు మా ఈగల్ టీమ్ రాజమహేంద్రవరం వెళ్లింది,” అని డీసీపీ వినీత్ మీడియాకు తెలిపారు.
బెంగళూరు టు భాగ్యనగర్.. పాత నేరస్థుల కొత్త దందా : పట్టుబడిన నిందితులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా, అందరికీ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నిందితుల్లో ఒకడైన విక్రమ్ రెడ్డికి, గతంలో సంచలనం సృష్టించిన మల్నాడు రెస్టారెంట్స్ డ్రగ్స్ కేసు ప్రధాన సూత్రధారి సూర్యతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. మొదట బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఈ ముఠా, ఇటీవల హైదరాబాద్‌కు మకాం మార్చి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. బెంగళూరు నుంచి చందన్, రాహుల్ డ్రగ్స్ తీసుకురాగా, ఇక్కడ పార్టీలను నిర్వహించినట్లు అంగీకరించారు. నగరంలోకి మత్తు పదార్థాలు ఏ రూపంలో, ఎటువైపు నుంచి వచ్చినా పసిగట్టే ‘ఈగల్ నిఘా’ నుంచి ఈ ముఠా తప్పించుకోలేకపోయింది.


