Hyderabad land auction prices : “అమ్మో.. ధరా?” అని ముక్కున వేలేసుకునేలా భాగ్యనగరంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) తాజాగా జారీ చేసిన స్థలాల వేలం నోటిఫికేషన్, హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఈ-వేలం పాటలు రియల్ ఎస్టేట్ రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకవైపు కోకాపేటలో చదరపు గజం కనీస ధరను ఏకంగా రూ.1.75 లక్షలకు పెంచడం సంచలనం రేపితే, మరోవైపు కేపీహెచ్‌బీ కాలనీలో ఎకరం భూమి రూ.70 కోట్లకు పలకడం స్థిరాస్తి మార్కెట్ జోరుకు అద్దం పడుతోంది. ఇంతకీ ఈ ధరల పెరుగుదలకు కారణమేంటి..? ప్రభుత్వ వ్యూహం ఫలించిందా..? ఈ వేలం పాటల వెనుక ఉన్న ఆసక్తికర పరిణామాలేంటి..?
కోకాపేటలో కనీస ధర రెట్టింపు.. ఆదాయమే లక్ష్యం : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో బంగారు బాతుగా మారిన కోకాపేటలో హెచ్‌ఎండీఏ స్థలాల వేలానికి కనీస ధరను భారీగా పెంచింది. గతంలో చదరపు గజానికి రూ.65,000గా ఉన్న కనీస ధరను ఏకంగా రూ.1.75 లక్షలకు చేర్చడం గమనార్హం. గరిష్ట ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సర్వే నెంబర్ 144లో ఉన్న 8,591 చదరపు గజాల ప్రభుత్వ భూమికి ఈ కొత్త ధరను వర్తింపజేశారు. దీని ప్రకారం, ఈ భూమి కనీస విలువే సుమారు రూ.150 కోట్లు దాటనుంది. గతంలో కోకాపేటలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఎకరం భూమిని రూ.100 కోట్లకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు జరగబోయే వేలంలో భూమి ధర ఎంత పలుకుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఎండీఏ ఈసారి “ఉత్తుత్తి వేలం” (కృత్రిమంగా ధరలను పెంచే ప్రయత్నం)కు చెక్ పెట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. గతంలో మోకిల వేలంలో కొందరు తక్కువ డిపాజిట్ చెల్లించి, ధరలను కృత్రిమంగా పెంచి, ఆ తర్వాత వెనక్కి తగ్గారు. దీన్ని నివారించేందుకు ఈసారి డిపాజిట్ రుసుములను భారీగా పెంచారు. ఉదాహరణకు, కోకాపేటలోని పైన పేర్కొన్న స్థలం వేలంలో పాల్గొనాలంటే రూ.5 కోట్లను డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.
కేపీహెచ్‌బీలో ఎకరాకు రికార్డు స్థాయిలో రూ.70 కోట్లు : హైటెక్ సిటీకి సమీపంలో, వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన కేపీహెచ్‌బీ (కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు) కాలనీలో భూమి ధర కొత్త రికార్డు సృష్టించింది. హౌసింగ్ బోర్డు బుధవారం నిర్వహించిన ఈ-వేలంలో 7 ఎకరాల 33 గుంటల స్థలం ఏకంగా రూ.547 కోట్లకు అమ్ముడుపోయింది. కనీస ధర ఎకరాకు రూ.40 కోట్లుగా నిర్ణయించినప్పటికీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, అరబిందో రియాల్టీ, అశోక బిల్డర్స్ లాంటి దిగ్గజ సంస్థలు పోటీ పడడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. మూడు గంటల పాటు సాగిన ఈ-వేలంలో బిడ్ ధర 46 సార్లు పెరిగిన తర్వాత, చివరికి గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థ ఎకరాకు రూ.70 కోట్ల చొప్పున ఈ స్థలాన్ని కైవసం చేసుకుంది. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పేద, మధ్యతరగతి ప్రజల కోసం నిర్మించే ఇందిరమ్మ ఇళ్లు వంటి గృహనిర్మాణ పథకాలకు వినియోగిస్తామని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు.
“రాజీవ్ స్వగృహ” ద్వారా మరో రూ.70 కోట్లు : మరోవైపు, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన అసంపూర్తి భవనాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి అదనంగా రూ.70.11 కోట్ల ఆదాయం సమకూరింది. పోచారం, గాజులరామారం టౌన్‌షిప్‌లలోని మూడు టవర్లను లాటరీ పద్ధతిలో కేటాయించారు. పోచారంలో రెండు టవర్లను ఎన్‌టీపీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్, గాయత్రి ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ట్రస్టుకు కేటాయించగా, గాజుల రామారంలోని టవర్‌ను ఎఫ్‌సీఐ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు కేటాయించారు.


