Kukatpally girl murder investigation : ఆ పసిపాప ఆర్తనాదాలు రెండు రోజులైనా ఇంకా ఆ వీధిలో ప్రతిధ్వనిస్తున్నాయి. కళ్లెదుటే ఆడుకున్న చిన్నారి… రక్తపుమడుగులో విగతజీవిగా మారిన దృశ్యం కంటికి కునుకు లేకుండా చేస్తోంది. అసలు ఆ పసిమొగ్గను అంత కర్కశంగా చిదిమేసిన ఆ మృగం ఎవరు..? బయటి నుంచి ఎవరూ రాలేదని సీసీటీవీ ఫుటేజీలు ఘోషిస్తుంటే… మరి ఆ భవనంలోనే ఉన్న నరహంతకుడు ఎవరు..? హైదరాబాద్‌ను ఉలిక్కిపడేలా చేసిన కూకట్‌పల్లి పదేళ్ల బాలిక హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ఎటువైపు సాగుతోంది..?
కూకట్‌పల్లిలో తీవ్ర సంచలనం సృష్టించిన పదేళ్ల బాలిక హత్య కేసు చిక్కుముడి రెండు రోజులు గడిచినా వీడలేదు. సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్య ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పట్టారు. హత్య జరిగిన సమయంలో బాలిక నివసిస్తున్న జీ+2 భవనం ప్రధాన ద్వారం నుంచి బయటి వ్యక్తులు ఎవరూ లోపలికి రాలేదని స్పష్టంగా గుర్తించారు. దీంతో ఈ దారుణానికి ఒడిగట్టింది భవనంలో నివసించే వ్యక్తులే అయి ఉంటారని పోలీసులు ఒక బలమైన అంచనాకు వచ్చారు.
ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు, ఇప్పటివరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. సోమవారం అర్ధరాత్రి ఒకరిని, మంగళవారం మరో ముగ్గురిని ప్రశ్నించారు. వీరి నుంచి సరైన పురోగతి రాకపోవడంతో, బాలిక తల్లిదండ్రులను సైతం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షల గురించి ఆరా తీశారు.
అనుమానాల వలయం.. వీడని మిస్టరీ: భవనంలో నివసించే బిహార్‌కు చెందిన ఓ యువకుడిపై మొదట అనుమానాలు వ్యక్తమయ్యాయి. చేతబడి నెపంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని ప్రచారం జరిగినా, విచారణలో అది వాస్తవం కాదని తేలింది. అనారోగ్యం కారణంగానే తాను చేతికి తాయెత్తులు కట్టుకున్నానని సదరు యువకుడు పోలీసులకు వివరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు సాంకేతిక ఆధారాలపై దృష్టి సారించారు. ఘటనా స్థలంలో సేకరించిన వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో సరిపోల్చడం, సెల్‌ఫోన్ డేటా విశ్లేషణ వంటి వాటితో దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నారు.
మంగళవారం ఉదయం బాలాపూర్ డీసీపీ సురేశ్‌కుమార్ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసును త్వరితగతిన ఛేదించాలని అధికారులకు కీలక సూచనలు చేశారు.
ఉన్మాదానికి నిలువుటద్దం: పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం, బాలిక శరీరంపై మొత్తం 20 కత్తి గాయాలున్నాయి. కేవలం మెడ భాగంలోనే 10 కత్తిపోట్లు ఉండటం హంతకుడి క్రూరత్వానికి అద్దం పడుతోంది. హత్య జరుగుతున్న సమయంలో బాలిక కేకలు వేసినట్లు పక్క భవనంలోని వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇది అత్యంత పక్కా పథకం ప్రకారం, ప్రతీకారంతో చేసిన హత్యేనని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాగా, బాలిక మృతదేహానికి సోమవారం రాత్రి ఆమె స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా మక్తాక్యాసారంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ ఘటన నగరంలో శాంతిభద్రతల వైఫల్యంపై రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు వంటి వారు సోషల్ మీడియా వేదికగా, మీడియా సమావేశాల్లో హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు.


