Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికకు (Jubilee Hills By-election) బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన మాగంటి గోపినాథ్ భార్య సునీతను (Maganti Sunitha) తమ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. ఈ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా అతని భార్య సునీతకే పార్టీ నాయకత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా నియోజకవర్గ స్థాయిలో మాగంటి సునీత పలు సామాజిక సేవలు, మహిళలకు అశ్రయం, విద్యాభివృద్ధి, ఆరోగ్య కార్యక్రమాలు వంటి రంగాల్లో ప్రత్యక్షంగా కలిసి పనిచేయడం కలిసి వస్తుందని పార్టీ భావిస్తోంది. మహిళా ఓటర్లు, సానుభూతి ఓట్లతో సులభంగా గెలుస్తామనే ధీమా పార్టీలో ఉంది.
వ్యూహం: గతంలో ఎన్నో సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినా.. మహిళా నేతలకు ఎక్కువగా అవకాశాలు రాలేదు. దీంతో ఈ ఉప ఎన్నికలో మహిళా కార్డుని బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. కనీస మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలు, పారిశుధ్య అంశాలపై వంటిపై ప్రత్యేక దృష్టి ఉంటుందని పార్టీ నాయకత్వం నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు వివరిస్తోంది.
కాంగ్రెస్, బీజేపీ నజర్: ఈసారి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టిగానే ఉండనుంది. కాంగ్రెస్‌లో టికెట్ కోసం నాయకుల మధ్య తీవ్రపోటీ ఉంది. గత ఎన్నికల్లో పోటీచేసిన మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ అజహారుద్దీన్‌కి పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది. దీంతో ఆయన అధికారికంగా రేసులోంచి తప్పుకున్నట్లే. ఇక ఆ తర్వాత నవీన్ యాదవ్, సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు రోహిన్ రెడ్డి, ఫహీమ్ ఖురేషీల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పార్టీ మాత్రం చివరి నిమిషంలో టికెట్ ఎవరికి కేటాయిస్తుందనే ఆసక్తి పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠను రేపుతోంది.
ఇక బీజేపీ సైతం అధికారికంగా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్‌రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండటం కలిసి రానుంది. ఇక మహిళలకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటే పోటీలో జూటూరి కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ, ఇతర పార్టీ సీనియర్ నాయకులు రేసులో ఉన్నారు.
ఎందుకు ప్రతిష్టాత్మకం?: ప్రస్తుతం ఉపఎన్నిక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపైనా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పార్టీలు ఈ సీట్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నప్పటికీ, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పాలనా లోపాలు, అభివృద్ధి అంశాలపై చర్చ జరుగుతోంది. బీజేపీ కూడా నగర పరిధిలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తోంది.


