Sunday, November 16, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Hyderabad Drugs: ఖాకీ వేసిన ‘కార్మిక’ వేషం - చర్లపల్లి డ్రగ్స్ కేసులో సినిమాటిక్...

Hyderabad Drugs: ఖాకీ వేసిన ‘కార్మిక’ వేషం – చర్లపల్లి డ్రగ్స్ కేసులో సినిమాటిక్ ట్విస్ట్!

Mumbai police undercover operation in Hyderabad  : సినిమాల్లో చూస్తుంటాం… నిజాయితీ గల ఓ పోలీస్ అధికారి, నేర సామ్రాజ్యం మూలాలను పెకిలించడానికి ఎలాంటి వేషమైనా వేస్తాడు, ఎంతటి సాహసానికైనా తెగిస్తాడు. సరిగ్గా అలాంటిదే, ఇంకా చెప్పాలంటే సినిమాను మించిన ఓ సాహసోపేత ఆపరేషన్ హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లిలో వెలుగుచూసింది.

- Advertisement -

మామూలు ఫార్మా కంపెనీ ముసుగులో కోట్ల విలువైన మత్తు పదార్థాలను తయారు చేస్తున్న ఓ ల్యాబొరేటరీ గుట్టు రట్టు చేయడానికి, ముంబయికి చెందిన ఓ పోలీస్ అధికారి ఏకంగా కార్మికుడిగా అవతారమెత్తాడు. ఒక కార్మికుడి రూపంలో డ్రగ్స్ ఫ్యాక్టరీలోకి అడుగుపెట్టిన ఆ ఖాకీ ఎవరు..? నెల రోజుల పాటు ఆ నరకంలో ఉండి ఏం చూశాడు..? కోట్ల విలువైన మత్తు దందా గుట్టును పక్కా ఆధారాలతో ఎలా బయటపెట్టారు..?

కార్మికుడి అవతారం : ఈ మొత్తం కేసులో అత్యంత కీలకమైన ఘట్టం ఇదే. ముంబయిలో పట్టుబడిన ఓ డ్రగ్స్ ముఠా ఇచ్చిన సమాచారంతో, అసలు సూత్రధారులు హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉన్న “వాగ్దేవీ ల్యాబొరేటరీస్” కేంద్రంగా పనిచేస్తున్నారని ముంబయి నార్కోటిక్స్ పోలీసులకు తెలిసింది. అయితే, నేరుగా దాడి చేస్తే ఆధారాలు దొరకవని భావించిన వారు, ఒక సాహసోపేతమైన పథకం రచించారు.

తమ బృందంలోని ఒక పోలీస్ అధికారిని కార్మికుడిగా మార్చి, ఆ ల్యాబొరేటరీలో పనికి చేరేలా చేశారు. నెల రోజుల పాటు ఆ అధికారి అక్కడే పనిచేస్తూ, లోపల ఏం జరుగుతుందో కంటికి రెప్పలా గమనించారు. డ్రగ్స్ తయారీ విధానం, ముడిసరుకు నిల్వలు, సరఫరా నెట్‌వర్క్ వంటి కీలక వివరాలన్నింటినీ పక్కాగా సేకరించారు.

ఎలా మొదలైంది బంగ్లా మహిళతో లింకు : ఈ భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టవడానికి అసలు మూలం ముంబయిలో పట్టుబడిన బంగ్లాదేశ్‌కు చెందిన ఫాతిమా మురాద్ షేక్ (23) అనే మహిళ. ఆగస్టు 8న ఆమె నుంచి 105 గ్రాముల మెఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆమెను లోతుగా విచారించారు. ఆమె ఇచ్చిన సమాచారంతో మరో 10 మందిని అరెస్టు చేశారు. వారిని విచారించగా అసలు డ్రగ్స్ తయారీ కేంద్రం హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉందని బయటపడింది.

పక్కా స్కెచ్‌తో దాడి.. పట్టుబడ్డ సూత్రధారులు : అండర్‌కవర్ ఆఫీసర్ నుంచి పక్కా సమాచారం అందిన వెంటనే, ముంబయి పోలీసులు రంగంలోకి దిగారు. మిరా భయాందార్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ ప్రమోద్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ చేరుకుంది. శనివారం చర్లపల్లి ఫేజ్-5, నవోదయ కాలనీలోని వాగ్దేవీ ల్యాబొరేటరీస్‌పై ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడిలో కోట్లాది రూపాయల విలువైన 5.79 కిలోల మెఫిడ్రోన్ (MD డ్రగ్), దాని తయారీకి ఉపయోగించే 35,500 లీటర్ల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ల్యాబొరేటరీ యజమాని వోలేటి శ్రీనివాస్ విజయ్, అతని సహాయకుడు తానాజీ పండరీనాథ్ పట్వారీలను అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబయికి తరలించారు.

యజమాని పాత నేర చరిత్ర : ప్రధాన నిందితుడైన వోలేటి శ్రీనివాస్ విజయ్‌కు నేర చరిత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలోనూ డ్రగ్స్ కేసులో పట్టుబడినప్పటికీ, తన పలుకుబడిని ఉపయోగించి బయటపడ్డాడు. నాలుగేళ్ల క్రితం చర్లపల్లిలో భవనాన్ని లీజుకు తీసుకుని, ఫార్మా ఉత్పత్తుల ముసుగులో ఈ అక్రమ దందాకు తెరలేపాడు. ఈ ముఠాకు మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ లింకులు ఉన్నాయని, ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసు కమిషనర్ నిఖేష్ కౌశిక్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad