Musi River floods: భారీ వర్షాల కారణంగా మూసీ నదికి వరద ప్రవాహం పోటెత్తింది. నగరానికి ఎగువ ప్రాంతంలో ఉన్న ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలకు వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు రిజర్వాయర్‌లు ఇప్పటికే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో.. ఆదివారం సాయంత్రం ఎగువ నుంచి వచ్చిన అదనపు వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. జంట జలాశయాల నుంచి మొత్తం 10 గేట్లు మూడు అడుగుల చొప్పున ఎత్తినట్లుగా పేర్కొన్నారు. దీంతో సుమారు ఐదు వేల క్యూసెక్కుల నీరు మూసీ నదిలోకి వస్తుంది.
లంగర్‌హౌస్ వద్ద కలుస్తున్న నీరు: ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్‌కు చెందిన 8 గేట్లను ఎత్తి మూసీ నదికి 2,704 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నాట్లుగా అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్ పైనుంచి 1,600 క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. రెండు గేట్లను ఎత్తి 1,981 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు పేర్కొన్నారు. ఈ నీరు లంగర్‌హౌస్ వద్ద మూసీ నదిలో కలుస్తోంది. దీంతో మూసీ నదికి వరద ప్రవాహం పోటెత్తింది.
Also read:https://teluguprabha.net/telangana-news/moderate-rains-forecast-for-telugu-states-2/
రాకపోకలకు అంతరాయం: ఎగువ నుంచి ప్రవాహం ఎక్కువగా వస్తుండడంతో నార్సింగి, హైదర్షాకోట్, మంచిరేవుల మీదుగా మూసీ నది పొంగి ప్రవహిస్తోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని సర్వీస్ రోడ్ల మీదకు నీరు వచ్చింది. దీంతో ఆ ప్రాంతాల్లో రాకపోకలను నిలిపివేశారు. జలమండలి, రెవెన్యూ, పోలీసు అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పరివాహక ప్రాంతం నుంచి వచ్చే వరదను బట్టి మరిన్ని గేట్లను తెరవడం లేదా మూయడం చేస్తామని అధికారులు అన్నారు. మూసీ నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికార యంత్రాంగం అప్రమత్తం: మూసీ నదికి వరద ప్రవాహం పోటెత్తడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వర్షాలు పడిన ప్రతిసారి రేవంత్ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేస్తూనేఉంది. ప్రస్తుతం కూడా కలెక్టర్లను మరియు విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేసింది. సహాయక చర్యల కోసం బృందాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.


