Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్RTC Neglect : ఆర్టీసీ ప్రయాణికులకు నరకం... అధికారుల నిర్లక్ష్యం!

RTC Neglect : ఆర్టీసీ ప్రయాణికులకు నరకం… అధికారుల నిర్లక్ష్యం!

RTC bus maintenance crisis : ప్రజారవాణాకు వెన్నెముక కావాల్సిన ఆర్టీసీ బస్సు, ప్రయాణికులకు నరకం చూపిస్తోందా..? వర్షం వస్తే గొడుగు పట్టాల్సిన దుస్థితి, కూర్చుంటే దుమ్ము అంటుకునే సీట్లు.. ఇదేనా మన నగర బస్సుల తీరు..? కొత్త ఎలక్ట్రిక్ బస్సులైనా కనీస సౌకర్యాలు కరవై, అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారుతున్నాయి. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది..? ఈ నిర్వహణా లోపానికి బాధ్యులెవరు..? ప్రయాణికుల గోసకు అంతమెప్పుడు..? 

- Advertisement -

వర్షం వస్తే.. వణుకే : హైదరాబాద్‌లో వర్షం కురిస్తే చాలు, ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. చాలా బస్సులకు కిటికీ అద్దాలు పగిలిపోయినా, బిగుసుకుపోయినా పట్టించుకునే నాథుడే లేడు. దీంతో వాన నీరు నేరుగా బస్సులోకి వచ్చి ప్రయాణికులను తడిపేస్తోంది. ఇక కొన్ని బస్సుల్లో వైపర్లు పనిచేయక, డ్రైవర్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బండి నడపాల్సి వస్తోంది. సికింద్రాబాద్-ఈసీఐఎల్ మార్గంలోని కొన్ని బస్సుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వాన పడితే రోడ్డు కనిపించక బస్సును పక్కన ఆపేయడమో, ప్రమాదకరంగా ముందుకు పోవడమో చేయాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు.

పాతవే కాదు.. కొత్తవీ ఇంతే : పాత బస్సుల సంగతి పక్కన పెడితే, ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన కొత్త ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ సమస్యలు తిష్ట వేశాయి. గచ్చిబౌలి నుంచి కోఠికి వెళ్లే ఓ ఎలక్ట్రిక్ బస్సులో యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ పనిచేయడం లేదని ఓ ప్రయాణికుడు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేశారు. మరో ఎలక్ట్రిక్ బస్సులో ఏకంగా పైకప్పు నుంచే నీళ్లు కారుతున్నాయని ఇంకో ప్రయాణికుడు వీడియోతో సహా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఘటనలు నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

నిర్వహణకు నిధుల కొరతనా – నిర్లక్ష్యమా :  సాధారణంగా బస్సు ట్రిప్పు ముగించుకుని డిపోకు రాగానే శుభ్రం చేయాలి. ప్రతి 12 వేల కిలోమీటర్లు తిరిగాక పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలి. కానీ చాలా డిపోల్లో ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. కొత్త బస్సుల కొనుగోలులో జాప్యం జరగడంతో, కాలం చెల్లిన బస్సులనే రోడ్లపైకి పంపుతున్నారు. విడిభాగాల కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి. ఆగస్టు 6న బహదూర్‌పుర వద్ద ఓ బస్సులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగడం భద్రతా లోపాలకు పరాకాష్ఠ. బ్రేకులు సరిగ్గా పనిచేయక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.

ఆపరు.. కదలరు.. ప్రయాణికుల గోస : నిర్వహణ సమస్యలే కాకుండా, సిబ్బంది ప్రవర్తన కూడా ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. బస్టాపుల్లో బస్సులు ఆపడం లేదని, రద్దీగా ఉంటే చూడనట్టు వెళ్లిపోతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. మరోవైపు, టికెట్లు ఇవ్వడం కోసం కొందరు కండక్టర్లు బస్సును నడిరోడ్డుపై నిమిషాల తరబడి ఆపేస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో ఇళ్లకు వెళ్లే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad