సంక్రాంతి పండుగ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పతంగులు, ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, సన్నాయి పాటలు, ఇవన్నీ వినోదాన్ని కలిగిస్తే, సంక్రాంతి పండుగకు ప్రత్యేకమైన ఆహార పదార్దాలు పిండి వంటలు.సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి ఇంట్లో తప్పని సరిగా గారెలు, అప్పాలు, మురుకులు, సకినాలు ,రవ్వ లడ్డూలు చేయాల్సిందే.
బిజీ లైఫ్ లో సంప్రదాయ వంటలకు ఫుల్ డిమాండ్
అయితే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో బిజిబీజీగా మారిన జనం సమయాభావం వల్ల ఇళ్లలలో పిండి వంటలు చేయడం మానేశారు.దీంతో పండుగుల సమయంలో ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగ తెలంగాణ పిండి వంటల పేరుతో అనేక చోట్ల వాటిని తయారు చేసి విక్రయిస్తున్నారు.ఇలా సంక్రాంతి సందర్బంగా తెలంగాణ పిండి వంటల కేంద్రాలు గారెలు, అప్పాలు, అరిశెలు, మురుకులు, సకినాలు, గరిజలు, గవ్వలు, చేబిళ్లలు, చేగోడీలు,సర్వపిండి వంటి సుమారు 40 రకాల పిండి వంటలు తయారుచేసి విక్రయిస్తున్నారు. ఇదే కాకుండా రకరకాల స్వీట్లు కూడా తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటితోపాటు కొన్ని కేంద్రాల్లో సంక్రాంతి పండుగ సమయంలో తెలంగాణ ప్రజలు అత్యంతంగా ఇష్టపడే మామిడి, నిమ్మకాయ, చింతకాయ, మటన్, చికెన్వంటి ఊరగాయలు సైతంఅందుబాటులో ఉంచుతున్నారు. అయితే పండుగ మరో నాలుగు రోజులు ఉండగానే నగరంలోని పిండివంటల కేంద్రాలు, వివిధ రకాలస్వీటు షాపులు జనంతో కిటకిటలాడుతున్నాయి.
వందల్లో వెలసిన పిండి వంటల సెంటర్లు
నగరంలో ఒకప్పుడు కొన్ని ప్రధాన కేంద్రాల్లో మాత్రమే పిండి వంటలలు తయారు చేసి విక్రయించేవారు . అయితే రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్ తో ఈ పిండివంటలు తయారు కేంద్రాలు వందల సంఖ్యలోపెరిగాయి. నగరంలో ప్రస్తుతం సుమారు200ల వరకు పిండి వంటల షాపులు ఉండగా, మరో 300లకు పైగా ఎలాంటి షాపులు లేకుండా కేవలం ఇంటి వద్దనే తయారు చేసి నేరుగా విక్రయించే చిరు వ్యాపారులు ఉన్నారు. ఈ షాపుల్లో గతంలో వందకు వంద శాతం విక్రయాలు జరుగగా ఇప్పుడు అది 10నుంచి 30శాతానికి మించడం లేదు.అయినప్పటికీ ఈ షాపుల్లో ప్రతి రోజు ఒక్కోక్కరు రోజుకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు విక్రయాలు చేస్తున్నట్లు అంచనా. మొత్తంగా 200 షాపుల్లో రోజుకు సుమారు రూ.60లక్షల మేరకు విక్రయాలు జరుగుతుండగా, ఇళ్ల వద్దనే నేరుగా అమ్మేవారు సైతం రోజుకు రూ.70లక్షల నుంచి రూ.90లక్షల వరకు విక్రయాలు జరుగుతున్నట్లు చెపుతున్నారు.
నగరంలో సుమారు 25 వేల స్వీటు షాపులు
సంక్రాంతికి పిండి వంటలతో పాటు చాలా మంది స్వీట్లు ఆరగిస్తారు. నగరంలో సుమారు 25వేల స్వీటు షాపులు ఉన్నాయి. ఇవన్నీ రాజస్తాన్, గుజరాత్ కు చెందిన మార్వాడీలతో పాటు, స్థానికంగా ఉండే మార్వాడీలు, కొన్ని షాపులు తెలంగాణకు చెందిన రెడ్లు, ఇతరులు నిర్వహిస్తున్నారు. ఈ షాపుల్లో రోజుకు కనీసంమ రూ.30 నుంచి రూ. 40లక్షల వరకు బిజినెస్ కొనసాగుతుందంటున్నారు. అయితే నగర జనాభాలో కేవలం 30శాతం మంది మాత్రమే ఈ స్వీట్లు కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెపుతున్నారు.అయతే సంక్రాంతి పండుగకు తెలంగాణ కంటే ఏపీలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ ప్రజలు దసరా పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారో ఏపీలో ప్రజలు సంక్రాంతి పండుగను కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండుగ అనేది ఏపీలో కొత్త అల్లుళ్ల పండుగా చెప్పుకుంటారు.అయితే హైదరాబాద్ నగరంలో దాదాపు 30లక్షలకు పైగా ఏపీ జనాభా ఉంది. వీరంతా తప్పని సరిగా సంక్రాంతి పండుటకు తమ సొంతూళ్లకు వెళుతుంటారు. అయితే పండుగ సందర్బంగా వీరంతా స్వీట్లను నగరంలో కాకుండా ఏపీలోని ముఖ్యమైన పట్టణాల్లో కొనుగోలు చేస్తారు. దీని వల్ల ఈ సంక్రాంతి పండుగ సందర్బంతా పిండి వంటలు, ఇతర రకాల స్వీట్లను కొనుగోలు చేసేదంతా తెలంగాణ వారు, హైదరాబాద్లో పూర్తి స్థాయిలో స్తిరపడిన వారు మాత్రమే కొంటారని చెపుతున్నారు. సంక్రాంతి పండుగకు అత్తవారింటి వారు అల్లుళ్లను ఆహ్వానించి వారికి సుమారు 200 నుంచి 300ల రకాల స్వీట్లు పెట్టే సంప్రదాయం ఉంది. అందు కోసం వారు నగరం నుంచి వారి వారి గ్రామాలు వెళ్లినా ఇన్ని రకాల స్వీట్లను ఇక్కడ కాకుండా కేవలం వారికి ఏపీలో అందుబాటులో ఉన్న కేంద్రాల్లో మాత్రమే కొనుగోలుచేస్తారని, దీని వల్ల నగరంలో స్వీట్లు విక్రయాలు క్రిస్మస్, నూతన సంవత్సరం రోజు కంటే తక్కువనే చెపుతున్నారు.
పిండి వంటలు, స్వీట్లు ధరలు ఇలా
నగరంలోని పిండి వంటకాల కేంద్రాల్లో లభించే గారెలు, ముర్కులు, రింగులు, చెగోడీలు , దొడ్డు మురుకులు కిలోకు రూ.340ల నుంచి రూ. 400ల వరకు విక్రయిస్తున్నారు. అలాగే నువ్వుల లడ్డూలు, అప్పాలు, గరిజలు, పల్లీల గారెలు కిలో రూ. 360ల నుంచి రూ.430ల వరకు విక్రయిస్తున్నారు. ఇక స్వీట్ల విషయానికొస్తే అన్ని రకాల స్వీట్లుకలిపి కిలో రూ. 500ల నుంచి రూ. 800ల వరకు విక్రయిస్తున్నారు. బేగంపేట్లోని పలు మార్వాడీ స్వీటు షాపుల్లో మాత్రమే లభించే పాస్ స్వీటు కిలో రూ.400లు విక్రయిస్తున్నారు. అయితే పాస్ స్వీటు అనేది మార్వాడీలు, గుజరాతిలుఅత్యంత ఇష్టంగా తినడం వల్ల బేగంబజార్ ఏరియాలో మాత్రమే లభించే ఈ స్వీటుకు చాలా డిమాండ్ ఉంది. అలాగే పూర్తి ఘీతో చేసిన స్వీట్లు కనీసం రూ.2వేల నుంచి మొదలవుతున్నాయి. అయితే సంక్రాంతి పండుగకు ఎక్కువగా గారెలు,సకినాలు, గరిజలు, దొడ్డు సకినాలు, మురుకులకు ఎక్కువగా డిమాండ్ ఉంటుందని నిర్వాహకులు చెపుతున్నారు.
గిరాకి తగ్గింది
ప్రతి యేటా సంక్రాంతికి మా షాపులో పది నుంచి 20 క్వింటాళ్ల సకినాలు, మురుకులు, గారెలు, అరిశెలు, ఐదు క్వింటాళ్ల లడ్డులూ, బూందీ, పది క్వింటాళ్ల స్వీట్లు అమ్మేవాళ్లం. అయితే గత రెండు,మూడేళ్లుగా గిరాకి తగ్గింది. ఐదేళ్ల క్రితం పిండి వంటల తయారు చేసే సెంటర్లు చాలా తక్కువగా ఉండేది. గతంలో పిండి వంటలు తయారు చేయడం నామోషీగా భావించినవాళ్లే ఇప్పుడు ఉపాధి కోసం చాలా చోట్ల షాపులు పెట్టారు. కొంతమంది తమ ఇళ్లలోనే వాటిని తయారు చేసి విక్రయిస్తున్నారు. అల్వాల్ వంటి ప్రాంతంలో ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసి విక్రయిస్తున్నారు దీంతో చాలా మంది ఆయా ప్రాంతాల్లోనేకొంటున్నారు. దీని వల్ల కొను గోలు దారులు పెరుగు తున్నా తయారు చేసే వారి సంఖ్య పెరుగడంతో గిరాకి మాత్రం తగ్గుతుంది.
–వంగపల్లి సావిత్రమ్మ, శ్రీదేవి పిండి వంటలు, నాచారం.