Tuesday, November 19, 2024
HomeTS జిల్లా వార్తలుకరీంనగర్Jammikunta: ఈ దోపిడీ ఆగేదెలా ?

Jammikunta: ఈ దోపిడీ ఆగేదెలా ?

దగా పడుతున్న రైతన్న

కష్టపడి వ్యవసాయం చేయడం తప్ప ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచన లేని వ్యక్తి రైతన్న, అలాంటి రైతన్న అంటే అందరికీ అలుసే. విత్తనం కొన్నప్పటి నుండి పంట చేతికంది మార్కెట్లో విక్రయించేంత వరకు అడుగడుగునా మోసపోతూనే ఉన్నాడు. విత్తనం కొనుగోలు చేసే సమయంలో వ్యాపారి చెప్పినంత డబ్బు చెల్లించి విత్తనాలు కొనుగోలు చేయడమే కాకుండా ఎరువుల విక్రయ సమయంలో సైతం ఎరువుల తయారీదారుడు చెప్పిన రేటుకే కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో కష్ట నష్టాలకోర్చి పండించిన పంటను మార్కెట్ కు విక్రయించేందుకు తీసుకురాగా అక్కడ సైతం వ్యాపారి చెప్పిందే రేటు అనే నానుడిని నిజం చేసేలా తయారైంది ప్రస్తుత పరిస్థితి. తాను పండించిన పంటకు ఇంత ధర అని నిర్ణయించలేని పరిస్థితుల్లో వ్యాపారి చెప్పిన రేటుకే నష్టం వాటిల్లిన సరే అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతన్నది. అలాంటి రైతన్న అడుగడుగునా నిలువు దోపిడీకి గురవుతున్న ఆ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. దేశానికి అన్నం పెట్టే అన్నదాత నేడు వ్యాపారస్తుల చేతుల్లో నిలువ దోపిడి గురికావడం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో నిత్య కృత్యంగా మారుతుంది.
👉 పత్తి రైతును చిత్తు చేస్తున్న వ్యాపారులు…
ప్రతికూల పరిస్థితులలో ఆరుగాలం కష్టపడి పత్తి పంటను సాగు చేసి పత్తిని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో విక్రయించేందుకు తీసుకురాగా వ్యాపారులు రైతన్నను నిలువు దోపిడీ గురిచేస్తున్నారు. మార్కెట్లో బిడ్డింగ్ సమయంలో నిర్ణయించిన ధరకు మిల్లులో పత్తిని దిగుమతి చేసుకునేటప్పుడు 100 రూపాయల నుండి 200 వరకు వ్యత్యాసం ఉంటుంది. సగం పత్తిని మిల్లులో దిగుమతి చేసుకున్న తర్వాత పత్తిలో నాణ్యత లేదంటూ తేమశాతం ఎక్కువగా ఉందంటూ నానా రకాలుగా కొర్రీలు పెడుతూ ధరల్లో వ్యత్యాసం చూపించడంతో రైతన్న ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో వ్యాపారులు చెప్పిన రేటుకే తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకోవాల్సి వస్తుంది. సుమారు 15 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకొచ్చిన రైతు వ్యాపారుల మాయజాలంతో రూ,2000 నుండి రూ,3000 వరకు నష్టపోవాల్సి వస్తుంది. ఇది ఒక్క రైతుకే కాదు మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులకు పత్తి విక్రయించేందుకు వచ్చే ప్రతి రైతు ఈ విధంగానే నష్టపోవాల్సిన పరిస్థితి జమ్మికుంట మార్కెట్లో ఉంది.

- Advertisement -


👉 పేరుగాంచిన జమ్మికుంట మార్కెట్ లోనే రైతన్న నిలువు దోపిడి…
ఉత్తర తెలంగాణలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ గా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కరీంనగర్ జిల్లా నుండే కాకుండా సమీప జిల్లాల నుండి సైతం రైతులు తాము పండించిన పత్తిని విక్రయించేందుకు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు వస్తుంటారు. దీన్ని అవకాశంగా మలుచుకున్న వ్యాపారాలు మార్కెట్లో బిడ్డింగ్ నిర్వహించే సమయంలో ఒక ధర నిర్ణయించగా మిల్లులో దిగుమతి చేసుకునేటప్పుడు ఆ ధరలో వ్యత్యాసం ఉంటుంది. ఈ విధంగా ఒక రైతు విషయంలో జరుగుతుందనుకుంటే పొరపాటే మార్కెట్ లో పత్తి విక్రయించేందుకు పత్తిని తీసుకొచ్చిన ప్రతి రైతు విషయంలో ఇదే జరుగుతుంది. నవంబర్ నెలలో మంగళవారం నాటికి 10 రోజులు మార్కెట్ లో పత్తి కొనుగోలు జరగా మొత్తం 10,990 క్వింటాళ్ల పత్తిని రైతులు విక్రయాలకు తీసుకొచ్చారు. అంటే రోజుకు సరాసరి 1099 క్వింటాళ్ల పత్తి మార్కెట్ కు వచ్చింది. మార్కెట్లో నిర్ణయించిన ధరకు మిల్లులో దిగుమతి చేసుకునే సమయంలో ధరల్లో వ్యత్యాసం 100 రూపాయల నుండి 200 వరకు ఉంటుంది. ఈ లెక్కన క్వింటాల్ 100 రూపాయల చొప్పున వ్యత్యాసం వేసుకున్న ప్రతిరోజు మిల్లర్లు రూ.1,10,000లను రైతుల నుండి నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతన్న సైతం తనకు జరిగిన మోసంపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక వచ్చిన కాడికి మా భాగ్యం అనుకునే పరిస్థితుల్లో ఉంటున్నారు.
👉 ప్రశ్నిస్తేనే న్యాయం చేస్తారా…
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఇటీవల రైతు సంఘం నాయకులు ప్రశ్నించిన సమయంలో కొంతమంది రైతులకు మార్కెట్లో నిర్ణయించిన ధరకు మిల్లులో దిగుమతి చేసుకున్న సమయంలో ధరకు వ్యత్యాసం లేకుండా తీసుకున్నారు. తప్ప మిగతా అన్ని సందర్భాలలో రైతును నిలువు దోపిడి గురి చేయడమే జరుగుతుంది. ఒకరో ఇద్దరో రైతులు మార్కెట్లో నిర్ణయించిన ధరకు ఇక్కడ మిల్లులో దిగుమతి చేసుకునే సమయంలో వ్యత్యాసం ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తే పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉందని నాసిరకంగా ఉందంటూ కారణం చెబుతున్నారు.

👉 మరి అధికారులు ఏం చేస్తున్నట్లు…
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు జరిగిన సమయంలో రోజుకు సరాసరి లక్షకుపై బడి రైతన్నలను వ్యాపారులు నిలువు దోపిడికి గురి చేస్తున్నప్పటికీ మార్కెట్ అధికారులు స్పందించకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. మార్కెట్లో ఒక రేటు మిల్లులో మరో రేటు విధిస్తున్నారంటూ పలువురు రైతన్నలు మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా మార్కెట్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. నూతన మార్కెట్ కమిటీ ఏర్పాటుతోనైనా తమకు న్యాయం జరుగుతుందేమోనని ఆశతో ఉన్నామని పలువురు రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో పత్తి కొనుగోలు జరిగిన రోజులలో లక్షల్లో రైతన్నలను వ్యాపారులు నిలువు దోపిడి గురి చేయడం జమ్మికుంట మార్కెట్లో నిత్య కృత్యంగా మారిందని ఈ దోపిడీని అరికట్టే వారే లేరా అంటూ అన్నదాతలు, రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News