గొప్ప ఆర్థిక సంస్కర్త భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి మృతి చెందడంతో శుక్రవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు విచారణ వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత దేశ ఆర్థిక అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహానుభావుడు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని, పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి గొప్ప నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు బుక్క వెంకటేశం, సయ్యద్ మీనాజుద్దీన్, రవిశంకర్, అశోక్ యాదవ్, చటమోని రమేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.