Saturday, November 23, 2024
HomeతెలంగాణKothagudem: బొగ్గు బ్లాక్స్ ప్రైవేటీకరణపై మహా ధర్నా

Kothagudem: బొగ్గు బ్లాక్స్ ప్రైవేటీకరణపై మహా ధర్నా

బొగ్గు బ్లాక్స్ ప్రైవేటీకరణను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం సాగింది.  కొత్తగూడెం అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఈ ధర్నా చేపట్టి గర్జించారు బీఆర్ఎస్ నేతలు. ఈకార్యక్రమంలో ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.  ఆకాశంలో ఎగురుతున్న విమానాలతో పాటు విమానాశ్రయాలు, పాతాళంలో ఉన్న బొగ్గు, నేలపై తిరిగే రైళ్లను కూడా అమ్మేశారని ఆయన విమర్శించారు.  దేశ సంపదనంతా మోడీ తన ఆప్తమిత్రుడు అదానీకి అప్పన్నంగా అప్పగిస్తున్నండని, పేదలను నిరుపేదలను చేస్తున్నండని రవిచంద్ర దుయ్యబట్టారు. గతంలో సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని చెప్పి, ఆరు నెలలు గడవక ముందే, గనులను వేలం వేయడం విచారకరమన్నారు. మహోద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కు సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకోవడం పెద్ద లెక్క కాదని రవిచంద్ర వ్యాఖ్యానించారు.  సింగరేణిని ప్రైవేటుపరం చేస్తుంటే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆయన సహచర ఎంపీలు నోరు మెదపకపోవడం దారుణమన్నారు.  బీజేపీ ఆధ్వర్యంలోని సోషల్ మీడియా కుట్రలు, కుయుక్తులు చేయడం మానుకుని మంచిని ప్రజల్లోకి తీసుకుపోవాలని హితవు పలికారు.  జాతీయ బడ్జెట్ ను 50లక్షల కోట్లతో ప్రవేశ పెట్టి పట్టుమని 10 నిమిషాలు కూడా చర్చించకుండా ఆమోదింపజేసుకోవడం, పార్లమెంటును ఉద్దేశపూర్వకంగా నడవకుండా చేసి నిరవధికంగా వాయిదా వేసుకోవడం ఆక్షేపణీయమన్నారు.

- Advertisement -

“మోడీ హటావో, సింగరేణి బచావో”,”మోడీ డౌన్ డౌన్”,”ముర్దాబాద్ ముర్దాబాద్ బీజేపీ ముర్దాబాద్”,”సింగరేణి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి”, “సింగరేణి గనులను వేలం వేయకుండా సింగరేణి సంస్థకే అప్పగించాలి”, మా బొగ్గు గనుల జోలికి వస్తే బీజేపీకి మిగిలేది బూడిదనే”, “లాభాలలో వాటానిచ్చే సింగరేణిని నష్టాల బాట పట్టించుటయేనా మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్” అనే నినాదాలు మహాధర్నా వేదిక వద్ద మిన్నంటాయి. “జై తెలంగాణ జైజై కేటీఆర్ జైజైజై కేసీఆర్”,”జై బీఆర్ఎస్ జైజై భారత్ “అంటూ గులాబీ శ్రేణులు నినాదాలిచ్చారు.  సింగరేణి కళాకారులు పాడిన పాటలు సభికులను ఉత్సాహపర్చాయి.

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్,ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు ,సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియ నాయక్ , మెచ్చా నాగేశ్వరరావు, కందాళ ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్ , మాజీ ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావు, ఖమ్మం జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల శేషగిరిరావు, కొత్తగూడెం మునిసిపల్ ఛైర్ పర్సన్ సీతామహాలక్ష్మీ, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ,బచ్చు విజయ్ కుమార్ తదితర ప్రముఖులతో కలిసి ఈ మహాధర్నాలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News