తెలంగాణ సర్కార్(Telangana Govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా కాంట్రాక్టు పద్దతిన కీలక పదవుల్లో కొనసాగుతున్న వారిని తొలగించింది. మొత్తం 6,729 మందిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ జి.కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజినీరు బీఎల్ఎన్ రెడ్డి కూడా ఉన్నారు. అలాగే పది మంది ట్రాన్స్ కో, జెన్ కో డైరెక్టర్లు ఉద్వాసనకు గురయ్యారు.
వీరి స్థానాల్లో కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులతో అప్రమత్తమైన మున్సిపల్ శాఖ తమ శాఖలో కాంట్రాక్టు పద్ధతిపై కొనసాగుతున్న 177 మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా 6,729 మంది ఉద్యోగుల స్థానంలో గ్రూప్ నోటిఫికేషన్ల ద్వారా కొత్త ఉద్యోగులను రేవంత్ రెడ్డి సర్కార్ ఎంపిక చేయనుంది.