Free bus in TG: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ కీలక స్పష్టత ఇచ్చారు. ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్ర పరిధిలోని చిరునామా ఉంటే చాలు, బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలను అనుమతిస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోని కారణంగా, కొందరు మహిళల ఆధార్ కార్డులపై రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని ఉంది. ఈ కారణంగా పలువురు కండక్టర్లు వారికి ఉచిత ప్రయాణాన్ని నిరాకరిస్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ సమస్యపై స్పందించిన ఈడీ, ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం జారీ చేసిన నివాస చిరునామాతో కూడిన గుర్తింపు కార్డులు కూడా ఉచిత ప్రయాణానికి చెల్లుబాటు అవుతాయని చెప్పారు. ఒకవేళ కండక్టర్లు నిరాకరిస్తే, టోల్-ఫ్రీ నంబర్ 04069440000కి ఫిర్యాదు చేయాలని సూచించారు.


