Interstate ganja smuggling bust: పైకి చూస్తే అదో మామూలు సిమెంట్ బస్తాల లారీ. కానీ ఆ బస్తాల మాటున దాగి ఉంది రూ.6.25 కోట్ల విలువైన మత్తు సామ్రాజ్యం. గంజాయి స్మగ్లర్లు పన్నిన ఈ కొత్త వ్యూహాన్ని రాచకొండ పోలీసులు తమ చాకచక్యంతో చిత్తు చేశారు. పక్కా సమాచారంతో మెరుపుదాడి చేసి, అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేశారు. ఇంత భారీ మొత్తంలో గంజాయిని ఎలా తరలిస్తున్నారు..? పోలీసుల కళ్లుగప్పడానికి వారు వేసిన ప్లాన్ ఏంటి? దానిని పోలీసులు ఎలా ఛేదించారు..?
పక్కా సమాచారం.. పక్కా ఆపరేషన్ : అంతర్రాష్ట్ర గంజాయి ముఠా కదలికలపై రాచకొండ ఎస్‌ఓటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్) పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన బృందాలు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్టు మండలం కొత్తగూడెం వద్ద వ్యూహాత్మకంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వస్తున్న ఓ డీసీఎం వాహనాన్ని ఆపి పరిశీలించగా, సిమెంట్ బస్తాల కింద దాచిన భారీ గంజాయి బస్తాలు బయటపడ్డాయి. మొత్తం 1,210 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.6.25 కోట్లు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు.
ఒరిస్సా టు రాజస్థాన్.. వయా తెలంగాణ : ఈ గంజాయిని ఒరిస్సా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.
నిందితులు: వాహనం డ్రైవర్, రాజస్థాన్‌కు చెందిన విక్రమ్ విష్ణోయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
సూత్రధారులు: ఈ అక్రమ రవాణా వెనుక దేవిలాల్, ఆయుబ్ ఖాన్, రాంలాల్ అనే వ్యక్తులు ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కొత్త పంథా: పోలీసుల కళ్లుగప్పేందుకు ముఠా ఈసారి కొత్త పంథాను ఎంచుకుంది. మొదట ఖమ్మంలో సిమెంట్ లోడును కొనుగోలు చేసి, ఆ బస్తాల మధ్యలో గంజాయి బస్తాలను చాకచక్యంగా దాచి రవాణాకు సిద్ధమయ్యారు.
రూ.5 లక్షల డీల్.. సీఎం సీరియస్ ఆదేశాలు : ఈ గంజాయిని సురక్షితంగా గమ్యస్థానానికి చేరిస్తే డ్రైవర్‌కు రూ.5 లక్షలు ఇస్తామని ముఠా ఒప్పందం చేసుకున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. “తెలంగాణ రాష్ట్రంలో గంజాయి జాడ ఉండకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే మేము పనిచేస్తున్నాం. మాదకద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతాం,” అని ఆయన హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఎస్‌ఓటీ బృందాలను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.


