చంచల్ గూడ జైల్లో అఘోరీకి(Aghori) ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేశారు. రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న అఘోరీ నిద్రపోకుండా గట్టి గట్టిగా కేకలు వేస్తుంది. దీంతో అఘోరీని ప్రత్యేక బ్యారెక్‌లో ఉంచారు. జైలు అధికారులు ఖైదీ నంబర్ 12121 కేటాయించి అఘోరీ ప్రవర్తనపై ప్రత్యేక నిఘా పెట్టారు. తన భార్య వర్షిణితో ఎప్పుడు ములాఖత్ చేయిస్తారని అధికారులతో అఘోరీ వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా చంచల్ గుడా జైలును సందర్శించిన మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ నెరేళ్ల శారదా అఘోరీని ఉంచిన బ్యారెక్ పరిశీలించారు.
కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మంచిర్యాల జిల్లా కృష్ణపల్లికి చెందిన శ్రీనివాస్ అఘోరీగా మారి రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో ఉండే మహిళ దగ్గర పూజల పేరుతో రూ.9.80 లక్షలు వసూలు చేశాడు. అయితే మరింత డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసు దర్యాప్తులో ఉండగానే అఘోరీ ఏపీ చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుని పారిపోయాడు. సైబరాబాద్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అఘోరీ ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చేవెళ్ల కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.