Allu Arjun: తెలంగాణ హైకోర్టు(TG Highcourt) నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయ్యారు. హైకోర్టు ఉత్తర్వులను బన్నీ తరపు న్యాయవాదులు జైలు సూపరింటెండెంట్‌కు అందించి రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించడంతో అల్లు అర్జున్‌ను అధికారులు విడుదల చేశారు. దీంతో బన్నీ తన కారులో నేరుగా జూబ్లీహిల్స్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం తన ఇంటికి చేరుకున్నారు.
కాగా ‘పుష్ప2’ రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను తన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నివాసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు బన్నీకి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్‌ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.