Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌ను రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) బన్నీ అరెస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. బట్టలు మార్చకోవడానికి సమయం ఇవ్వకుండా బెడ్ రూమ్ నుంచి నేరుగా అరెస్టు చేసి తీసుకెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. జాతీయ అవార్డు గ్రహీత పట్ల ఇలా అమర్యాదగా వ్యవహరించి అగౌరవపరిచిన తీరు ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు. తన నటనతో భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ఓ నటుడు పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు.
ఇక మాజీ మంత్రి హరీష్ రావు(Harishrao) కూడా జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు?అని ఆయన ప్రశ్నించారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే అని చెప్పారు. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే అని ట్వీట్ చేశారు.
మరోవైపు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్(Raja Singh) కూడా అల్లు అర్జున్ అరెస్ట్(Allu Arjun Arrest)పై ఎక్స్ వేదికగా స్పందించారు. విషాదకరమైన తొక్కిసలాటకు పోలీసు శాఖ వైఫల్యమే కారణమని తెలిపారు. జాతీయ అవార్డు(National Award) గెలుచుకున్న స్టార్ తప్పు కాదన్నారు. అలాగే అల్లుఅర్జున్ తన విజయాలతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గర్వం తెచ్చారని తెలిపారు. ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం పరిపాలనపై చెడుగా ప్రతిబింబిస్తుందని చెప్పారు.