Monday, November 17, 2025
HomeతెలంగాణEarn While You Learn : చదువుతో పాటే సంపాదన.. అంబేడ్కర్‌ వర్సిటీ సరికొత్త ప్రస్థానం!

Earn While You Learn : చదువుతో పాటే సంపాదన.. అంబేడ్కర్‌ వర్సిటీ సరికొత్త ప్రస్థానం!

Stipend-based skill development programs for students : కేవలం పట్టా చేతికివ్వడమే కాదు, ఆ పట్టాతో పాటు ఉపాధిని కూడా అందించే బృహత్తర లక్ష్యంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ముందడుగు వేసింది. దూరవిద్యలో చదువుతున్న విద్యార్థులకు ‘చదువుకుంటూనే సంపాదించే’ అద్భుత అవకాశాన్ని కల్పిస్తూ దేశంలోనే ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 

- Advertisement -

స్టెప్’తో సరికొత్త శకం: డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ, ఆచరణాత్మక నైపుణ్యాలను అందించే లక్ష్యంతో వర్సిటీ అధికారులు ‘స్టైపెండ్ ఆధారిత విద్యా కార్యక్రమం’ (STEP)ను ప్రారంభించారు. ఇది విద్యార్థులకు ఒకే సమయంలో చదువు, సంపాదన అందిస్తున్న ద్విగుణీకృత లాభం.

కీలక ఒప్పందం: ఈ కార్యక్రమం కోసం దేశంలోని అగ్రశ్రేణి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలతో అనుసంధానమై ఉన్న ‘రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RASCI)’తో విశ్వవిద్యాలయం కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

ఉపాధి అవకాశాలు: ‘స్టెప్’ కింద ఎంపికైన విద్యార్థులు తమకు సమీపంలోని దుకాణాలు, వాణిజ్య కేంద్రాల్లో శిక్షణ పొందుతూ పని చేయవచ్చు. తద్వారా నెలకు రూ.7,000 నుంచి రూ.24,000 వరకు స్టైపెండ్ రూపంలో సంపాదించుకోవచ్చు.

లక్ష్యం మరియు ప్రాధాన్యత: తొలి దశలో 10,000 మంది విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు ఇందులో పెద్దపీట వేయనున్నారు.

మహిళా శక్తికి ‘వీ-ఎనేబుల్’ అండ: అంబేడ్కర్ వర్సిటీలో విద్యనభ్యసించే వారిలో మహిళలే అధికం. వారిని కేవలం విద్యావంతులుగా మాత్రమే కాకుండా, సమర్థులైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వర్సిటీ ‘వీ-హబ్’తో చేతులు కలిపింది. ‘వీ-ఎనేబుల్’ పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని పట్టాలెక్కించింది.

నైపుణ్య శిక్షణ: మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీసి, వారి ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. వారికి మార్కెటింగ్ నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సాహం: ప్రతి సంవత్సరం 2,000 మంది మహిళలను వ్యూహకర్తలుగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా, అంకుర సంస్థల ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం.

గ్రామీణ విద్యార్థులకు చేయూత: వీ-హబ్‌తో పాటు, స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ ద్వారా ప్రతి ఏటా 5,000 మంది గ్రామీణ, గిరిజన విద్యార్థులకు స్వల్పకాలిక వృత్తివిద్యా కోర్సులను అందించనున్నారు.

సార్వత్రిక విద్యకు కొత్త రూపు: యూజీసీ రూపొందించిన నూతన విద్యా విధానాలను అమలు చేస్తూ సార్వత్రిక విద్యకు సరికొత్త నిర్వచనం పలుకుతున్నామని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. పాలిటెక్నిక్, ఐటీఐ వంటి నైపుణ్య ఆధారిత కోర్సులకు డిగ్రీతో సమానమైన గుర్తింపు ఇస్తున్నామని, ఒకేసారి రెండు డిగ్రీలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

“విద్యకు సంబంధించి యూజీసీ రూపొందించిన కొత్త విధానాలను అమలు చేస్తున్నాం. ఒకేసారి రెండు డిగ్రీలు చేసే వీలుంది. ఇక్కడ బీఎస్సీ చదువుకుంటూనే ఇతర విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు చదవచ్చు. వచ్చే పదేళ్లలో తెలంగాణలోని ప్రతి ఇంటికి నైపుణ్య, ఉపాధి ఆధారిత విద్యను అందించాలన్నదే మా లక్ష్యం.”


__ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ఉప కులపతి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad