సనత్ నగర్ – ఎర్రగడ్డ రోడ్డు విస్తరణతో వాహనదారుల ఇబ్బందులు తొలగిపోతాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ ప్రధాన రహదారిలో జరుగుతున్న విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు విస్తరణ, డివైడర్ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. సబ్ స్టేషన్ స్థలం సేకరించి రోడ్డును విస్తరించడం వల్ల రహదారి విశాలంగా మారిందని తెలిపారు. రోడ్డు, డివైడర్ ల నిర్మాణం పూర్తయితే ఈ రహదారిలో ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రయాణించే అవకాశం ఉంటుందని అన్నారు.
అనంతరం దాసారం బస్తీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని కొందరు కోరగా, మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బస్తీ దవాఖానలో ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారన్నారు. ఈ నెల 26 వ తేదీన బస్తీ వాసులతో సమావేశం నిర్వహిస్తామని, బస్తీవాసులు ఏకాభిప్రాయంకు రావాలని సూచించారు. మంత్రి వెంట కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ మోహన్ రెడ్డి, ఈఈ ఇందిరా తదితరులు ఉన్నారు.