తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీకి సంబంధించిన జెండానే రాష్ట్రంలో గద్దెనెక్కుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయి నుండి ఉపముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన ఘనత ఆందోల్ నియోజకవర్గానికి ఉంది. అలాంటి నియోజకవర్గం రాజకీయాలు నేడు ప్రశ్నార్థకంగా మారాయి.
లోకల్ నినాదంతో గెలుపొందిన చంటి క్రాంతి కిరణ్ కు ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో 12 మంది కౌన్సిలర్లు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. దీంతో 12 మంది వైపు ఉండాలా లేక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అంటూ వీరిద్దరిని వెనుకేసుకోవాలా అన్నది ప్రశ్న. ఇక ప్రతిపక్ష బీజేపీ విషయానికి వస్తే ఇక్కడ బాబూ మోహన్ కు టికెట్ ఇస్తే బీజేపీ గెలవటం మాట అటుంచి బాబూ మోహన్ ను తరిమి తరిమి కొట్టడం ఖాయం అనేలా పరిస్థితులు మారాయి. బీజేపీ కార్యకర్త ఒకరు.. రాబోయే ఎన్నికల్లో స్థానికంగా బీజేపీ ఎలాంటి కార్యాచరణ రూపొందించాలన్న విషయంపై బాబూ మోహన్ కు చేసిన కాల్ రేపిన దుమారం అందరికీ తెలిసినదే.
దీంతో ఆందోల్ నియోజకవర్గం బీజేపీలో బాబుమోహన్ను సాగనంపే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈనేపథ్యంలో అటు అధికార బీఆర్ఎస్, ఇటు ప్రతిపక్ష బీజేపీకి ఆందోల్ రాజకీయాలు తలనొప్పులుగా మారాయి.