Sunday, November 16, 2025
HomeతెలంగాణKalthi Kallu: కల్తీ కల్లు కారణంగా మరొకరు మృతి.. ప్రభుత్వం సీరియస్!

Kalthi Kallu: కల్తీ కల్లు కారణంగా మరొకరు మృతి.. ప్రభుత్వం సీరియస్!

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కారణంగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 70 ఏళ్ల పెద్ద గంగారాం అనే వ్యక్తి మృతిచెందాడు. అతడు ఆదర్శ్‌నగర్, ఇంద్రా హిల్స్‌ ప్రాంతానికి చెందిన వృద్ధుడు కాగా, శారీరకంగా దివ్యాంగుడిగా ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో వాంతులు చేసుకోవడంతో అతడిని ప్రాథమికంగా ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి మార్చి చికిత్స కొనసాగించారు. వైద్యుల ప్రకారం అతడి కిడ్నీలు పనిచేయకపోవడంతో చికిత్స కొనసాగుతున్న సమయంలోనే ఆయన మృతి చెందారు. దీంతో అంత్యక్రియల కోసం మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా బిచ్కుందకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 19 మంది బాధితులకు చికిత్స జరుగుతోందని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ తెలిపారు. వీరిలో ఒకరు ఆసుపత్రి అనుమతి లేకుండానే బయటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. కిడ్నీల పనితీరు బలహీనపడటంతో సీఆర్‌ఆర్టీ విధానంలో వైద్యం అందిస్తున్నామని తెలిపారు.

సీపీఐ డిమాండ్: నష్టపరిహారం ఇవ్వాలి

ఈ ఘటనపై స్పందించిన సీపీఐ నేత డీజీ నర్సింహరావు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాంపల్లిలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన సీపీఐ నేతలు, ఒక్కొక్కరు చనిపోవడంతో ఆయా కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా, 42 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. నిమ్స్ ఆసుపత్రి వర్గాల ప్రకారం, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కేసులు 9కి చేరుకున్నాయి. డయాలసిస్ అవసరమవుతున్న మరింత మంది బాధితులకూ వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం 11 మంది ఆరోగ్యం నిలకడగా ఉండగా, 12 మందిని నిఘాలో ఉంచి చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.

ఆరోగ్య మంత్రికీ అప్డేట్

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులతో మాట్లాడారు. నిమ్స్‌లో 35 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురిని డిశ్చార్జ్ చేసినట్టు, మిగిలిన వారికి చికిత్స కొనసాగుతోందని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు. గాంధీలో 18 మందిలో నలుగురు డయాలసిస్‌పై ఉన్నారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. పూర్తిగా కోలుకునే వరకూ ఆసుపత్రిలోనే ఉంచాలని మంత్రి ఆదేశించారు.

మూడు దుకాణాలు సీజ్

ఈ ఘటనపై ప్రభుత్వ స్పందన మొదలైంది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా, బాలానగర్ ఎక్సైజ్ ఎస్ఎచ్ఓ వేణుకుమార్‌ను సస్పెండ్ చేశారు. మరికొంతమంది అధికారులపై విచారణ కొనసాగుతోంది. మద్యం ఉత్పత్తిలో నిషేధిత ‘ఆల్ఫ్రాజోలం’ రసాయనాన్ని కలిపినట్టు తేలడంతో, హైదర్‌నగర్, సర్దార్ పటేల్‌నగర్, హెచ్ఎంటీ హిల్స్ ప్రాంతాల్లోని మూడు మద్యం దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. ఈ కల్తీ కల్లు తయారీకి ప్రధాన బాధ్యుడిగా ఉన్న కూన సత్యంగౌడ్‌ను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. ఇంతకుముందు నలుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad