Azharuddin was sworn in as a Minister in the Telangana cabinet: భారత మాజీ క్రికెట్ కెప్టెన్, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనతో పదవీ, గోప్యతా ప్రమాణాలను చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ మంత్రులు హాజరయ్యారు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో అజారుద్దీన్ అల్లా పేరు మీద ఆంగ్లంలో ప్రమాణం చేసి, ‘జై తెలంగాణ’, ‘జై హింద్’ అంటూ ముగించారు.
అజారుద్దీన్ ప్రమాణ స్వీకారంతో రేవంత్ రెడ్డి కేబినెట్ బలం 16కి చేరింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో మైనారిటీ వర్గం నుండి అజారుద్దీన్ ఏకైక మంత్రిగా ప్రాతినిధ్యం వహించడం విశేషం. సుమారు 23 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తర్వాత మైనారిటీ వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కింది. ముస్లిం వర్గానికి చెందిన నేతను మంత్రిగా చేయాలనే డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం ద్వారా నెరవేర్చింది.
రాజకీయ ప్రాధాన్యత:
ఈ ప్రమాణ స్వీకారం నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో దాదాపు 25 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉండటంతో, మైనారిటీ నేతను కేబినెట్‌లోకి తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. విపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా, మైనారిటీ బుజ్జగింపు చర్యగా విమర్శించాయి.
ప్రస్తుతానికి అజారుద్దీన్ శాసనసభ సభ్యుడు గానీ శాసనమండలి సభ్యుడు గానీ కాదు. అయితే యనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలనే ప్రభుత్వ సిఫార్సు గవర్నర్ పరిశీలనలో ఇప్పటికే పెండింగ్‌లో ఉంది. నియమం ప్రకారం, ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుండి ఆరు నెలల్లోగా తప్పనిసరిగా చట్టసభ సభ్యుడిగా ఎన్నిక కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి లేదా రెండు రోజుల్లో అజారుద్దీన్‌కు మైనారిటీ సంక్షేమం లేదా క్రీడలు, యువజన సర్వీసుల వంటి కీలక శాఖలను కేటాయించే అవకాశం ఉంది.


