రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం సమీపంలో ఈరోజు రూ.10 లక్షల నిధుల వ్యయంతో బండి సంజయ్ కుమార్ అభివ్రుద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ కార్యాలయానికి వెళ్లిన బండి సంజయ్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ సర్వే నివేదికలు చూసినా బీజేపీ ముందంజలో ఉందన్నారు. బీజేపీ గెలిచే స్థానాల్లో నెంబర్ వన్ ప్లేస్ లో కరీంనగర్ ఉందన్నారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అతి తక్కువ వ్యవధిలోనే ప్రజా వ్యతిరేకత నెలకొందన్నారు.
రాష్ట్రంలో హామీల అమలుకు తగిన బడ్జెట్ లేదని, వాటిని అమలు చేసే పరిస్థితి లేదని ప్రజలకు అర్ధమైందన్నారు. దేశవ్యాప్తంగా మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రజలు కోరుతున్నారని, కరీంనగర్ లోనూ ప్రజలు పువ్వు గుర్తుపై ఓటేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా గ్రామ గ్రామానికి వెళ్లి కేంద్ర పథకాలపై ప్రచారం చేయడంతోపాటు మోదీ సాధించిన విజయాలను గుర్తు చేస్తూ అత్యధిక మెజారిటీతో బీజేపీ గెలిచేలా చేయాలని కోరారు. అక్కడి నుండి చింతకుంటకు వెళ్లిన బండి సంజయ్ పార్టీ నాయకులతో కలిసి సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారుల ఆశీస్సులందుకున్నారు. అనంతరం నేరుగా రేకుర్తి వెళ్లి సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బెల్లం బంగారం సమర్పించారు.