Dangers of online gaming addiction : “ఆడుతూ పాడుతూ వేలు సంపాదించండి”.. ఈ ప్రకటన ఓ మాయల మరాఠీ. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఈ ఆశల ఎర, ఎందరో యువకుల జీవితాలను చిదిమేస్తోంది. చదువుల నుంచి ఉద్యోగాల వరకు, కుటుంబాల నుంచి కెరీర్ల వరకు.. ఈ ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం ఓ పెను భూతంలా పట్టి పీడిస్తోంది. ప్రభుత్వం పబ్జీ, రమ్మీ, డ్రీమ్11 వంటి అనేక బెట్టింగ్ యాప్‌లను నిషేధించినా, అక్రమ మార్గాల్లో ఈ ‘ఆట’ ఆగడం లేదు. అసలు ఈ వ్యసనం ఎంత ప్రమాదకరంగా మారింది..? దీని బారిన పడకుండా మనల్ని, మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి..?
మచ్చుకు కొన్ని ఘటనలు : ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఈ వ్యసనం కోరలు చాస్తోంది. సిద్దిపేటకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి, ఆన్‌లైన్ మనీ గేమ్స్‌లో భారీగా డబ్బు పోగొట్టుకుని, అప్పులు తీర్చలేక ఊరే విడిచి పారిపోయాడు. అతని కుటుంబం వీధిన పడింది.
చదువుకోవాల్సిన విద్యార్థులు, లక్ష్యాలను మరిచి అప్పులు చేసి మరీ ఈ గేమ్‌లు ఆడుతూ, భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు.
ఎందుకీ వ్యసనం? లక్ష్యాలను మరిచి : ఈ ఆన్‌లైన్ గేమ్స్ ఊబిలోకి యువత దిగజారడానికి అనేక కారణాలున్నాయి.
సులభ ధనంపై మోజు: తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చనే అత్యాశే ప్రధాన కారణం. సరదాగా మొదలై..: స్నేహితులతో సరదాగా మొదలుపెట్టిన ఆట, క్రమంగా వ్యసనంగా మారి, జీవితాన్ని శాసిస్తోంది.
తల్లిదండ్రుల నిర్లక్ష్యం: పిల్లలు అన్నం తినడం లేదనో, మారాం చేస్తున్నారనో, వారి చేతిలో స్మార్ట్‌ఫోన్లు పెట్టడం, వారిని ఈ వ్యసనం వైపు నెడుతోంది. ఈ వ్యసనం కేవలం ఆర్థికంగానే కాదు, శారీరకంగా, మానసికంగా కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గంటల తరబడి ఫోన్‌కు అతుక్కుపోవడం వల్ల ఊబకాయం, దృష్టి లోపం వంటి సమస్యలు.
నిద్రలేమి, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన :బంధుత్వాలకు, స్నేహాలకు దూరమై, ఒంటరితనాన్ని కొనితెచ్చుకోవడం.
“సెల్‌ఫోన్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి. డబ్బు ఊరకే రాదని గ్రహించాలి. ప్రభుత్వం నిషేధించిన ఆన్‌లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండండి. స్మార్ట్‌ఫోన్‌లో ఆడితే ఎవరికీ తెలియదనుకోవద్దు, మా నిఘా పటిష్ఠంగా ఉంటుంది, దొరికిపోతారు. తల్లిదండ్రులు పిల్లల అలవాట్లను ఓ కంట కనిపెడుతూ ఉండాలి.”
– అనూరాధ, సిద్ధిపేట పోలీస్ కమిషనర్
చట్టం ఏం చెబుతోంది : ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్- 2025’ ప్రకారం, డబ్బుతో ఆడే అన్ని రకాల ఆన్‌లైన్ గేమ్స్, వాటి ప్రకటనలు నిషేధం. వీటిని ఆడినా, ప్రోత్సహించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. క్షణికానందం కోసం, సులభ ధనంపై మోజుతో, జీవితాలను నాశనం చేసుకోవద్దని నిపుణులు, పోలీసులు ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు.


