పేదింటి ఆడపచులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం భరోసా అని ఈ పథకానికి మరిన్ని మెరుగులు దిద్ది అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమని కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కల్యాణ లక్ష్మి షాదీ ముభారక్ పథకం క్రింది కొత్తగూడెం మున్సిపాలిటీ చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి మండలాల్లో ఎంపికైన 135 లబ్దిదారులకు రూ.1.35కోట్ల విలువగల చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అందించారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభలో కూనంనేని మాట్లాడుతూ ఆడబిడ్డలకు వివాహాలు చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఒకింత ఆసరాగా నిలుస్తుందని అన్నారు.
ప్రస్తుతం ఈ పథకానికి అర్హులైన వారికి కూడా తులం బంగారం అందించేవిదంగా చర్యలు చేపట్టాలని కోరారు. సంబంధిత అధికారులు దరఖాస్తుల లోటుపాట్లు సరిచేసి అందరికి పథకం అమలయ్యే విధంగా చొరవ తీసుకోవాలని సూచించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో 62మంది లబ్దిదారులకు, కొత్తగూడెం మండలంలో 41 మందికి, చుంచుపల్లి మండలంలో 32 మందికి పథకం మంజూరైనట్లు తెలిపారు. ప్రతి పేద కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసికోవాలని కోరారు. చెక్కులు అందుకున్న లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఛైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపిపిలు బాదావత్ శాంతి, భూక్యా సోనా, కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల తహసీల్దార్లు పుల్లయ్య, కృష్ణ, ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ కే సాబీర్ పాషా, సిబ్బంది పాల్గొన్నారు.