ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ఒబేసిటీ, రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి రోగాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతీ యువకులు బేకరీ ఫుడ్, హోటల్ ఫుడ్, అధికంగా మాంసాహారం, మద్యపానం తీసుకోవడం, ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం వలన అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని భీమదేవరపల్లి మండల కేంద్రంలో విచ్చలవిడిగా న్యూట్రిషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో 45 రోజులు వారు ఇచ్చే మందులు వాడడం చేత బరువు పెరగడం, బరువు తగ్గడం రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయని ప్రజలను నమ్మించి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది.
న్యూట్రిషన్ సెంటర్లో ఇచ్చే మందుల వలన ఒకేసారి బరువు తగ్గడం, బరువు పెరగడం షుగర్ లెవెల్స్, బీపీ హెచ్చుతగ్గుల వలన ప్రజలు మరణించే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. జంక్ ఫుడ్, మాంసాహారం, మద్యపానం అధికంగా తీసుకోకుండా ప్రతిరోజు వ్యాయామం చేయడం చేత ఆరోగ్యంగా ఉండొచ్చని అరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నూట్రిషన్ సెంటర్లపై అధికారుల తనిఖీలు చేపట్టకపోవడం గమనార్హం. మండలంలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వెలసిన న్యూట్రిషన్ సెంటర్ లపై అధికారులు కొరడా విధించనున్నారా? లేదా వేచి చూడాల్సిందే?