మహిళల ఓర్పు, సహనంతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్త్రీ, శిశు సంక్షేమ దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈవేడుకలకు ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ,నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాలల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారన్నారు. మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతిని ఆయన తెలిపారు. మహిళలు ఓర్పు, సహనంతో కుటుంబాల అబివృద్దికి ఆలంబనగా నిలుస్తున్నారని చెప్పారు.
మహిళాభివృద్ధి ద్వారానే దేశం పురోగతిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారని, స్త్రీ లేనిదే మానవ మనుగడ లేదని ఆయన తెలిపారు.
అనంతరం వివిధ రంగాలలో విశిష్ట సేవలందిస్తున్న మహిళలను శాలువా, మెమెంటో లతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి నాగేశ్వరరావు, జడ్పి సీఈవో విజయలక్ష్మి, సిపిఓ సామ్యూల్, సీడీపీఓ అవంతిక, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.