భూపాలపల్లి నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు తావే లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల క్షేమాన్ని కాంక్షించి పనిచేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విస్పష్టంగా తేల్చి చెప్పడంతో అధికార వర్గాల్లో అంతర్మధనం మొదలయ్యింది. అవినీతి మచ్చపడిన అధికారులను ఆయన నియోజకవర్గ పొలిమేరలు దాటించే విధంగా సత్వర చర్యలు చేపడుతున్నారు. ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ఒక సీఐని ఇతర కారణాలతో ఇద్దరు ఎస్ఐలను ఆ శాఖ ఐజికి లేఖ రాసి బదిలీ చేయించినట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వయంగా వెల్లడించారు. ఇటీవల విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సమయంలో తన నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు తావేలేదని ఆయన చెప్పడం విశేషం. అవినీతి అక్రమాలకు పాల్పడితే ఏ స్థాయి అధికారినైనా బదిలీ చేయించే వరకు నిద్రపోయేది లేదని ఆయన స్పష్టంగా ప్రకటించడం అధికార వర్గాల్లో గుబులు రేపుతోంది.
తన ఎమ్మెల్యే పదవి కాలంలో అవినీతి అక్రమాలు, భూకబ్జాలు, పైరవీల పేరిట అమాయకులను దోచుకోవడం ఎంత మాత్రం జరగనివ్వనని ఆయన ఖరాఖండిగా చెబుతున్నారు. అవినీతికి పాల్పడేది తమ పార్టీ నాయకులైన, కార్యకర్తలైన ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన కఠినంగా చెబుతున్నారు. అవినీతి అధికారుల చిట్టా ఎవరి దగ్గర ఉన్న తమకు సమాచారం ఇస్తే వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చి బదిలీ చేయించేందుకు ఎంతమాత్రం వెనకాడనని ఆయన చెబుతున్న తీరు పలువురుని ఆకట్టుకుంటుంది. అవినీతి అక్రమాలపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా ప్రకటించడమే కాకుండా, ఆచరిస్తున్న తీరు పలువురి ప్రశంసలు అందుకుంటుంది.