జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఐదు మండలాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రతిపాదించిన చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పనులు గత పదిహేను సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మంథని శాసనసభ్యులు డి శ్రీధర్ బాబు మంత్రివర్గంలో కీలక బాధ్యతలు చేపట్టడంతో రైతుల్లో చిన్న కాలేశ్వరం పై ఆశలు చిగురించాయి. జిల్లాలోని ఐదు మండలాలల్లోని 45 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం అందించాలన్న లక్ష్యంతో 2009లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన ఎత్తిపోతల పనులు గత పదిహేను సంవత్సరాలుగా నత్త నడకన సాగుతున్నాయి. ఫలితంగా సాగునీటి సౌకర్యం మాత్రం రైతులకు అందుబాటులోకి రాలేదు. చిన్నకాళేశ్వరం పనులు పూర్తయితే భూపాలపల్లి జిల్లాలోని ఐదు మండలాల రైతులకు ఈ ఎత్తిపోతల వరంగా మారే అవకాశం వుంది. మహాదేవపూర్ మండలం బీరసాగర్ వద్ద గోదావరి నది ప్రక్కన 2009 లో ఎత్తిపోతలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదట్లో 500 కోట్ల అంచనాలతో శంకుస్థాపన చేసిన ఈ పథకం తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు 270కోట్ల నిధులతో పైప్ లైన్ల నిర్మాణం పూర్తి చేసుకుంది. మిగతా పనులకు అటవీ పర్యావరణ అనుమలతో పాటు భూసేకరణలో జరుగుతున్న జాప్యం ఎత్తిపోతలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖర రావు బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల తర్వాత 2016 మే 2న కాలేశ్వరం ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ వద్ద భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా అప్పటి మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అటవీ పర్యావరణ శాఖ అనుమతి లేక నిలిచిపోయిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఐదుమండలాల రైతాంగానికి సాగునీటి సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. స్పందించిన కేసీఆర్ అప్పటికప్పుడే మంత్రి హరీష్ రావు తో మాట్లాడీ అటవీ పర్యావరణ అనుమతులు సాధించి చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.అనంతరం కాలేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మళ్ళీ కదలిక వచ్చింది. రెండు సంవత్సరాలుగా విద్యుత్ లైన్లు అటవీ పర్యావరణ అనుమతులు సాధించి పనుల్లో వేగం పెంచారు.
జిల్లాలోని కాటారం మహాదేవపూర్ మహాముత్తారం మల్హర్ పలిమెల మండలాల్లోని 45 వేల ఎకరాలకు అందించడమే కాక 14 రిజర్వాయర్లను అభివృద్ధి చేసి వాటిలో ఈ సంవత్సరం పాటు నీరు నిల్వ ఉండే విధంగా ప్రణాళిక తయారు చేశారు. అప్పటి అంచనాల ప్రకారం499.24కోట్లతో పరిపాలన అనుమతి తీసుకొని పనులు ప్రారంభించారు. ప్రస్తుతం భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడంతో కాటారం మండలం లోని గారేపల్లి లోని కొత్తచెరువు నిర్మాణాన్ని భూయజమానులు అడ్డుకుంటున్నారు ప్రస్తుతం కాళేశ్వరం నుండి కాటారం వరకు పైపు లైనువేసుకోవడానికి అటవీశాఖ అనుమతులు పొంది నిర్మాణం పూర్తి చేశారు. నిర్మాణపు అంచనాలు632 కోట్లుగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.దీనిలో ప్రస్తుతం రెండు వందల 81 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు కింద మహాదేవపూర్ మండలం లోని మందిరం చెరువు కింద 4.061 ఎకరాలు ఎర్ర చెరువు కింద 3.126 కాటారం మండలం లోని కొత్తచెరువు కింద 2.032 ఎకరాలు గారేపళ్లి చెరువు కింద 1.893 ఎకరాలు మహాముత్తారం మండలం లోని పోలారం చెరువు కింద 4.272 ఎకరాలు ఎల్లమ్మ చెరువు కింద 4356 కాలు ఆదివారంపేట చెరువు కింద 3187 ఎకరాలు గుమ్మల పల్లి చెరువు కింద 3655 ఎకరాలు వీ రపురం చెరువు కింద నాలుగు వేల 50 ఎకరాలు రుద్రారం చెరువు కింద 4వేల 500 ఎకరాలు కొత్తపళ్లి చెరువు కింద రెండు వేల రెండు వేల మూడు వందల ఎకరాలు కొత్తపల్లి తండా చెరువు కింద 2500 ఎకరాలు ధన్వాడ చెరువు కింద 2220 గూడూరు చెరువు కింద 3500 ఎకరాలకు సాగునీరు ఈ ప్రాజెక్టు ద్వార అందించాల్సి ఉంది. ఇంతవరకు చిన్న కాలేశ్వరం ప్రాజెక్ట్ పనులు 60 శాతం పూర్తి కాలేదు ప్రాజెక్ట్ కోసం మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఎకరాల భూమి అవసరం ఉండగా, ఇప్పటివరకు 1366 మాత్రమే ఎకరాల మాత్రమే భూమి సేకరణ జరిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి మంథని శాసనసభ్యులు డి శ్రీధర్ బాబుకు మంత్రివర్గంలో చోటు లభించడంతో చిన్న కాలేశ్వరం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఐదు మండలాల రైతులు కోరుకుంటున్నారు.