BJP accepts Rajasingh Resignation: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయన రాజీనామాను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఈమేరకు రాజాసింగ్ రాజీనామాను నడ్డా ఆమోదించినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి తనను నామినేషన్ వేయకుండా కొందరు అడ్డుకున్నారని రాజాసింగ్ వాపోయారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డానని అన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు కూడా శత్రువుగా మారనని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కనీసం విలువ ఇవ్వని మీ పార్టీకి.. మీకో దండం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జూన్ 30వ తేదీన రాజీనామా లేఖను పంపించారు.
తాజాగా పార్టీ అధిష్టానం ఆయన రాజీనామా లేఖను ఆమోదించింది. దీంతో రాజాసింగ్ రాజకీయ భవిష్యత్ ఎటువైపు సాగనుందో ఆసక్తికరంగా మారింది. తనకు రాజకీయా జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరతారని కొందరు.. కాంగ్రెస్ పార్టీలో చేరతారని మరికొందరు చెబుతున్నారు. మరి రాజాసింగ్ అడుగులు ఏ పార్టీ వైపు వెళ్లనున్నాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
గత కొద్దిరోజులుగా బీజేపీ రాష్ట్ర నేతలపై రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చారు. పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలను చీకటిలో రహస్యంగా కలుస్తూ చెత్త రాజకీయాలు చేస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే చీకటి రాజకీయాలు చేసే నేతలను పక్కన పెట్టాలని అధిష్టానం పెద్దలకు సూచనలు చేశారు. పార్టీలో తన మాటకు విలువ ఉండటం లేదని వాపోయారు.
Also Reda: ఓట్ల కోసమే రామ జపమా..? బీజేపీపై కేటీఆర్ ఫైర్
కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. ముఖ్యంగా పాతబస్తీలో ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా తన గళం బలంగా వినిపించేశారు. ఈ క్రమంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్‌యలు చేయడంతో పార్టీ ఆయనను కొన్ని నెలల పాటు సస్పెండ్ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు సస్పెండ్ ఎత్తివేసి గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ మళ్లీ ఇచ్చింది. హిందూత్వ వాదిగా పేరు తెచ్చుకున్న రాజాసింగ్ రాజీనామా చేయడం బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. తాజాగా ఆయన రాజీనామాను ఆమోదించడం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా పరిగణిస్తున్నారు.



