హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి(HCU) సంబంధించిన 400 ఎకరాల భూముల వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తుతో భూములను చదును చేస్తున్నారు. దీంతో యూనివర్సిటీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పచ్చని భూములను నాశనం చేస్తున్నారంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. దాంతో పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థుల అరెస్టులను బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే త్వరలోనే వీరికీ కేసీఆర్‌కి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులకు అండగా ఉంటామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారని, తక్షణమే దీనిపై రాహుల్ స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని ఆరోపించారు. విద్యార్థుల పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.