తెలంగాణలోని మదర్సాలపై(Madarsas) బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అనుమతులు లేకుండా అనేక మదర్సాల్లో కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మదర్సా కార్యకలాపాలపై తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ మదర్సాలో మొత్తం 70 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 65 మంది బీహార్‌లోని కిషన్ గంజ్ జిల్లాకు చెందిన వారన్నారు. వారికి బోధించే ఉపాధ్యాయులు కూడా అదే ప్రాంతం వారని పేర్కొన్నారు.
కిషన్ గంజ్‌లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు స్థానిక హిందువుల భూములను బలవంతంగా లాక్కుంటూ ‘ల్యాండ్ జిహాద్’కు పాల్పడుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. జిన్నారంలో కోదండరామస్వామి ఆలయ భూముల్లో మదర్సా ఎలా ఏర్పాటైందో అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై తన విచారణలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయన్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి వారిని వెనక్కి పంపే చర్యలు చేపట్టాలని సూచించారు.