పెళ్లిళ్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుగుతాయి. తెలంగాణలో జరిగే పెళ్లిళ్లలో ఏది ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకోరు గానీ.. విందులో ముక్క పడకపోత రచ్చ రచ్చ చేస్తారు. విందులో చికెన్ వడ్డించలేదన్న కారణం చూపి మగపెళ్లివారు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన యువకుడికి, కుత్బుల్లాపూర్‌కు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. షాపూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఉదయం వీరిద్దరి వివాహం జరగాల్సి ఉంది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక మూడుముళ్లు వేయడమే తరువాయి. తెల్లవారితే పెళ్లి అవుతుందన్న వారి సంతోషాన్ని, కలల్ని.. చికెన్ చిన్నాభిన్నం చేసింది.
ఆదివారం రాత్రి ఆడపెళ్లివారు విందు ఏర్పాటు చేశారు. వధువుది బీహార్‌కు చెందిన మార్వాడీ కుటుంబం కావడంతో విందులో అన్నీ శాకాహార వంటలే చేశారు. కాసేపట్లో భోజనాలు పూర్తవుతాయనుకుంటున్న సమయంలో వరుడి తరపు స్నేహితులు భోజనాలకు వచ్చారు. అక్కడున్న శాకాహార వంటలు చూసి చికెన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించి గొడవపడి తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. వరుడి స్నేహితులు చేసిన గొడవ.. ఇరు కుటుంబాల మధ్య చిచ్చు రేపింది.
మా సాంప్రదాయం ప్రకారం భోజనాలకు వంటకాలు చేయించాం. పెళ్లికి మాంసాహారం పెట్టడం ఇంతవరకూ లేదు. దీని గురించి గొడవ పడటం సబబుగా లేదని ఆడపెళ్లివారు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. మగపెళ్లివారు వినిపించుకోలేదు. మాటమాట పెరగడంతో వివాహం ఆగిపోయింది. మగపెళ్లివారు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు జీడిమెట్ల సీఐని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో రేపు (బుధవారం) వివాహం జరిపించాలని నిర్ణయించారు.