Telangana Defection Case in Supreme Court: తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన అంశం మరోసారి సుప్రీంకోర్టును చేరింది. రాష్ట్రంలో అధికార పార్టీలోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే విషయంలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తరఫున ఈ పిటిషన్ దాఖలైంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై గతంలోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని నిర్దిష్ట గడువు విధించింది. అయితే, స్పీకర్ ఆ గడువులోగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, కాంగ్రెస్ పార్టీ కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ధిక్కరిస్తోందని బీఆర్‌ఎస్ తన పిటిషన్‌లో స్పష్టం చేసింది.
మరోవైపు, పార్టీ ఫిరాయింపుల అంశంపై పూర్తి విచారణ జరిపి, నిర్ణయం తీసుకోవడానికి తమకు మరింత గడువు కావాలని కోరుతూ స్పీకర్ కార్యాలయం సైతం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక అదనపు పిటిషన్‌ను దాఖలు చేయడం గమనార్హం. స్పీకర్‌కు అదనపు గడువు ఇవ్వాలా లేక ధిక్కార పిటిషన్‌ను విచారించాలా అనే అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది.
అత్యవసర విచారణకు బీఆర్‌ఎస్ అభ్యర్థన:
బీఆర్‌ఎస్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని బీఆర్‌ఎస్ తరపు న్యాయవాది మోహిత్ రావు, చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. తమ కేసు విచారణకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్, “నేను ఈ నెల 23న పదవీ విరమణ చేస్తున్నాను. ఆ తర్వాత నవంబర్ 24 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు” అని వ్యాఖ్యానించారు.
విచారణ వాయిదా:
ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. దీంతో, బీఆర్‌ఎస్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌తో పాటు, స్పీకర్ కార్యాలయం వేసిన గడువు కోరుతూ దాఖలైన అదనపు పిటిషన్‌పై కూడా సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


