లగచర్ల (Lagacherla) వెళుతోన్న మహిళా సంఘాలను, సామాజిక కార్యకర్తల్ని, నిజ నిర్ధారణ కమిటీలను పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు ప్రభుత్వంపై మండిపడ్డారు. గత వారం అర్ధరాత్రి పోలీసులు జరిపిన దాడుల్లో గిరిజన మహిళలపై దాడి చేసి.. వారి కుటుంబ సభ్యులను అరెస్టు చేసిన సంఘటనపై దర్యాప్తు చేయాలని కోరుతూ లగచర్ల వెళ్లిన మహిళా హక్కుల సంఘాలు, పౌర హక్కుల కార్యకర్తలను అడ్డుకోవడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
“లగచర్లలో అర్థరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండే కాదు.. పట్టపగలు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా ?? నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోంది ? వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోంది ? సీఎం సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధం ఏమిటి ? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా..? లేక లగచర్ల.. చైనా బార్డర్లో ఉన్న కల్లోలిత ప్రాంతమా??” అంటూ కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
“నిజనిర్ధారణ కోసం లగచర్లకు వెళ్తున్న సామాజిక కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం. POW నాయకురాలు సంధ్య, ఇతర మహిళా సభ్యుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డీ… ఇదేనా మీరు చెప్పిన ఏడో హామీ అయిన ప్రజాస్వామ్య పాలన? అని హరీష్ రావు ప్రశ్నించారు. “కంచెలు, ఆంక్షలు, నిర్బంధాలు లేని పాలన అన్నరు. కానీ, అవి లేకుండా మీ పాలనలో రోజు గడవడం లేదు. లగచర్ల గిరిజన బిడ్డలకు జరిగిన అన్యాయం వెలుగు చూడకుండా ఎంత మందిని అడ్డుకుంటరు? అక్రమ కేసులు పెడుతూ ఇంకెంత మంది నోళ్ళు మూయిస్తరు?” అంటూ నిలదీశారు. అధికారం ఉందని రేవంత్ రెడ్డి సాధారణ ప్రజలనే కాదు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలను నిర్బంధాలకు గురిచేస్తున్నాడన్నారు. సీఎం నిర్బంధ, నిరంకుశ, రాక్షస పాలన కొనసాగిస్తున్నడని హరీష్ రావు ధ్వజమెత్తారు.