ఏప్రిల్ 27న వరంగల్‌లో బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆ సభను పెద్ద విజయం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పట్టుదలతో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా జనసమీకరణ చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఫెక్సీలు, బ్యానర్లతో పాటు గోడ పెయింటింగ్‌లు చేపట్టాయి. తాజాగా చెన్నూరులో ఈ సభ గురించి వేసిన వాల్ రైటింగ్‌ని మున్సిపల్ అధికారులు చెరిపేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) తనదైన శైలిలో స్పందించారు. “కాంగీ కాకుల్లారా, మీరెన్ని కుట్రలు చేసినా ఏప్రిల్ 27న యావత్ తెలంగాణ వరంగల్ లో ఉండబోతోంది. ఆరోజు మిగిలేది కేవలం రేవంత్ రెడ్డి ఆయన అసిస్టెంట్లు మాత్రమే. గాంధీ భవన్ లో మా సభ లైవ్ చూస్తూ చక్కగా కాలక్షేపం చేసుకోండి” అని రాసుకొచ్చారు.