ప్రధాని మీద నమ్మకంతో పెద్ద నోట్ల రద్దును సమర్ధించినట్టు మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ కో హాఠావో దేశ్ కో బచావో తమ నినాదం అన్న హరీష్.. బీజేపీ వాగ్దానాల అమలు పై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు తో 50 రోజుల్లో అంతా బాగుంటుందని పెద్దలు భరోసా ఇచ్చారు, 2,000 రోజులైంది ఏం మార్పు తెచ్చారని హరీష్ ప్రశ్నించారు.
నోట్ల రద్దు పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానంతో నిజాలు బయటకు వచ్చాయని, నోట్ల రద్దు అట్టర్ ప్లాప్ షో అని కేంద్రం అంగీకరించకనే అంగీకరించిందన్నారు.
నోట్ల రద్దు గొప్పది కాదు గనుకే బీజేపీ నేతలు దీనిపై మాట్లాడటం లేదని, మౌనం అంగీకారాన్ని సూచిస్తోందని ఆరోపించారు. బీజేపీ చెప్పేదొకటి చేసేదొకటన్న విషయానికి నోట్ల రద్దు ఫ్లాప్ కావటమే అతి పెద్ద ఉదాహరణ అన్నారు.
మంత్రి టి.హరీష్ రావు, ఎమ్మెల్యే లు కాలేరు వెంకటేష్, కృష్ణమోహన్ రెడ్డి, చిరుమర్ధి లింగయ్య, ఎమ్మెల్సీ లు దండే విఠల్, దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.