BRS Reaction on Kavitha and Mallanna Issue: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త వివాదం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. బీసీ రిజర్వేషన్ విషయంలో ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న BRS ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేఇస్నా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి నేతలు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి చేయడంతో పాటు పలువురిని తీవ్రంగా గాయపరిచారు. అయితే ఈ సమస్యపై తొలిసారిగా BRS పార్టీ అధికారికంగా స్పందించింది. ఇప్పటివరకు కవితపై ఏ ఒక్క అధికారిక ప్రకటన వెలువరించని BRS, ఇప్పుడు మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తూ స్పష్టమైన ప్రకటన చేసింది.
BRS శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పార్టీ అధికారిక ‘X’ (ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు. ఆయన పేర్కొంటూ “మహిళల గౌరవాన్ని కాపాడడం మన భారతీయ సంస్కృతిలో భాగం. రాజకీయ విభేదాల నేపథ్యంలో వ్యక్తిగత దూషణలు చేయడం, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం తగదు. ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని హెచ్చరించారు.
ఇటీవల కాలంలో కవిత BRS కార్యక్రమాల్లో అంతగా కనిపించకపోయినా, ఆమెపై పార్టీ ఇంత తీవ్రంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లో యాక్టీవ్‌గా ఉండటమే కాక, కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో, BRS ఈ స్థాయిలో ఆమెకు మద్దతుగా నిలబడటం విశేషం. కేసీఆర్‌కి కవిత రాసిన లేఖతో పార్టీతో ఆమె దూరం పెరిగిందని చెబుతుండగా, ఇప్పుడు బీఆర్‌ఎస్ తీసుకున్న ఈ కొత్త వైఖరి ఆమెను తిరిగి పార్టీ ప్రధాన వర్గానికి సమీపించే సూచనగా భావించవచ్చు.
ఇక తీన్మార్ మల్లన్నపై కఠినంగా స్పందించిన మధుసూదనాచారి, “మహిళలపై నీచంగా మాట్లాడటం ఒక చట్టబద్ధ పదవిలో ఉన్న వ్యక్తికి ఏమాత్రం తగదు. కవితపై చేసిన వ్యాఖ్యలపై వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు” అని హెచ్చరించారు. ఈ వివాదంతో తెలంగాణ రాజకీయాల్లో మహిళల పాత్ర, గౌరవం, నాయకుల భాషాపరిమితులపై కొత్త చర్చ మొదలైంది. మహిళలపై దూషణలకు రాజకీయాల్లో స్థానం లేకుండా ఉండాలన్న దిశగా ఇటువంటి స్పందనలు కొనసాగాలి అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.


