కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కులగణన సర్వే(Caste census survey)ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఇంటింటికి తిరిగి సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు కూడా ఈ సర్వేలో తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఈనెల 30వ తేదీతో ఈ సర్వే పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఇంటికి కులగణన ఎన్యూమరేటర్లు వెళ్లారు.
అయితే అధికారులకు ఆమె పూర్తిగా సహకరించడం గమనార్హం. ఇవాళ(శనివారం) ఉదయం బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి అధికారులు వెళ్లారు. ఇందులో భాగంగా కవిత, ఆమె భర్త అనిల్.. తమ కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేయించారు. ఇదిలా ఉంటే కులగణనలో అడిగే ప్రశ్నలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విధితమే. వ్యక్తిగత వివరాలు అడగరాదని డిమాండ్ చేస్తున్నారు. ఆస్తులు, ఉపాధి వివరాలు ఎందుకు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కులగణన ద్వారా రాష్ట్రంలో ఏ కులం వారు ఎతం మంది ఉన్నారనే దానిపై స్పష్టత వస్తుందని.. తద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను సక్రమంగా ప్రవేశపెట్టొచ్చని ప్రభుత్వం చెబుతోంది.