KTR| ప్రభుత్వం చేపట్టిన కులగణన కార్యక్రమంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. కేవలం బీసీ ఓట్ల కోసమే కులగణన చేపడుతోందని ఆరోపించారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది దాటఙనా ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వరంగల్ జిల్లా హనుమకొండలో బీఆర్ఎస్ నేతలతో ఆయన సమవేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. చేతి గుర్తుకు ఓటేసిన పాపానికి చేతివృత్తిదారుల గొంతు కోశారని విమర్శించారు.
బీసీల ఓట్ల కోసం అధికారులను బలిపశువులను చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా.. కాంగ్రెస్ ఓబీసీ మంత్రిత్వశాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే కులగణన ప్రస్తావన తీసుకొచ్చారని కేటీఆర్ వెల్లడించారు. ఎంబీసీకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వనందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీసీలకు క్షమాపణ చెప్పాలన్నారు.
అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా పూర్తి మంత్రివర్గం నింపలేని రేవంత్ రెడ్డి.. బీసీలకు ఏం చేస్తారని నిలదీశారు. బీసీ ఓట్ల కోసం కులగణన అంటున్నారు కానీ రిజర్వేషన్ల గురించి మాత్రం మాట మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. కులగణన పేరుతో బ్యాంకుల్లో డబ్బెంత ఉంది..? ఏసీ, టీవీ, ప్రిడ్జ్ ఉందా..? అని అడగడమేంటి అని దుయ్యబట్టారు. కులగణన కోసం వెళ్లిన అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు.