ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)పై కేసు నమోదైంది. సిద్ధిపేట కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ (Chakradhar Goud) ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హరీష్ రావుతోపాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపైనా కేసు నమోదైంది.
ఈ సందర్భంగా చక్రధర్ మీడియాతో మాట్లాడుతూ… హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో హరీష్ రావుపై కేసు నమోదు అయినట్లు వెల్లడించారు. రాజకీయంగా అడ్డు వస్తున్నానని కక్ష్య పెంచుకుని, హరీష్ రావు దగ్గరుండి నా ఫోన్ ట్యాప్ చేయించారని చక్రధర్ ఆరోపించారు. హరీష్ రావును అరెస్ట్ చేసి జైల్లో వెయ్యాలి అని డిమాండ్ చేశారు. తన భార్య, తల్లి, డ్రైవర్ తో మాట్లాడిన కాల్స్ కూడా రికార్డ్ అయ్యాయని చక్రధర్ పేర్కొన్నారు.
Also Read : మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు
“2023 నుండి ఇప్పటి దాకా ఫోన్ ట్యాపింగ్ కేసుపై కొట్లాడుతున్న. 2024 జూన్ నెలలో ఫోన్ ట్యాప్ అయ్యింది అని డిజిపికి వినతి ఇచ్చాను. న్యాయం జరగకపోవడంతో కోర్టుకు వెళ్ళాను. నా ఇంట్లో 20 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. నన్ను రాధాకిషన్ రావు చంపుతా అని బెదిరించాడు. నా మీద రేప్ కేసు, ఉద్యోగాల మోసం కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసారు. హరీష్ రావు చిన్నపిల్లగాడు ఏమి కాదు. ఎన్నో కుటుంబాలను, వ్యాపారస్తులను లొంగదీసుకున్నారు. నా మీద 6కేసులు అయ్యాయి. నా యాపిల్ ఫోన్ నుండి ఫోన్ ట్యాప్ అయినట్లు మెసేజ్ వచింది. హరీష్ రావు సంవత్సరం పాటు నా ఫోన్ ట్యాప్ చేసాడు. నా ఇంట్లో భార్య, తల్లితో, డ్రైవర్ తో మాట్లాడింది అన్ని రికార్డ్ చేశారు. నా లాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు. ముందుకు రావాలి.. హరీష్ రావుతో నాకు ప్రాణహాని ఉందని డిజిపికి విన్నవించకున్నా. హరీష్ రావు చేసినవన్నీ స్కాములే.. అన్నీ బయటపెడతా. రాధాకిషన్ రావుని కస్టడీలోకి తీసుకుంటే అంతా బయటపడుతుంది. హరీష్ రావే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి” అని చక్రధర్ గౌడ్ ఆరోపించారు.