Revanth fires on central government: తెలంగాణ రైతాంగానికి అవసరమైన యూరియా సరఫరాలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి, వివక్షపై ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ, రాష్ట్ర రైతులకు అండగా నిలబడాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మోడీని పొగడటంలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తమ విజ్ఞప్తులను, లేఖలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో, తెలంగాణ రైతుల పక్షాన పార్లమెంట్‌లో గళం విప్పిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి ముఖ్యమంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆమె చొరవను ప్రశంసించారు. యూరియా సరఫరా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మద్దతు ఇవ్వాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో కనిపించకపోవడంపైనా రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. “గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపే వాళ్లు… ఢిల్లీలో మోడీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు?” అని ఆయన ప్రశ్నించారు. ఇది మోడీపై భయమా లేక భక్తా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో యూరియా కొరత రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. పంటలకు యూరియా సకాలంలో అందకపోవడం వల్ల దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.


