ఒకప్పుడు గుడుంబా పెద్ద సమస్యని, ఇప్పుడు అది లేదని, ప్రస్తుతం పల్లె, పట్టణం తేడా లేకుండా డ్రగ్స్ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎంత సంపాదించినా మన పిల్లలు బాగుండాలని కోరుకుంటామని, ఆ పిల్లలే డ్రగ్స్ బారిన పడితే ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) నుంచి గంజాయి వస్తోందనే సమాచారం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. చొరబాట్లు, ఇతర సమస్యలు రాకుండా దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా అప్రమత్తంగా ఉంటుందో, పహారా కాస్తుందో, అలాగే రాష్ట్ర సరిహద్దుల్లోనూ పోలీసులు అలా అప్రమత్తంగా ఉండి, పహారా కాసి తెలంగాణలోకి గంజాయి మొక్క, డ్రగ్స్ రాకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు, ఆపై స్థాయి అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు శాఖలో సీబీసీఐడీ, ఏసీబీ, గ్రేహౌండ్స్, అక్టోపస్ వంటి విభాగాలు ఏర్పాటు చేశారని, ప్రస్తుతం సైబర్ నేరాలు, డ్రగ్స్ సమాజాన్ని పట్టి పీడిస్తున్నందున సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఏర్పాటయ్యాయన్నారు. డ్రగ్స్, సైబర్ నేరాలు పట్టిపీడిస్తున్నందున వాటిని అరికట్టేందుకు అవసరమైన సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలని పోలీసులకు ముఖ్యమంత్రి సూచించారు. ఐపీసీ, సీఆర్‌పీసీల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తెచ్చినందున వాటిపైనా పూర్తి అవగాహన తెచ్చుకోవాలని, అందుకు అవసరమైన శిక్షణ తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అలా శిక్షణ పొందినప్పుడే సమాజం నుంచి నూతనంగా ఏర్పాటయ్యే సవాళ్లను ఎదుర్కొవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.. దేశంలో ఎక్కడ తీవ్రవాద, ఉగ్రవాద కదలికలు, అరెస్టులు అయినా, బాంబు పేలుళ్లు జరిగినా అదనపు సమాచారం కోసం కేంద్ర హోం శాఖ నుంచి ఆయా రాష్ట్రాల పోలీసులు తెలంగాణ ఎస్ఐబీ సహకారం కోరతారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. మన రాష్ట్ర పోలీసు, హైదరాబాద్ పోలీసుపై అందరికీ నమ్మకం ఉందని, నేరగాళ్ల ఆలోచనను, వాళ్లు వేసే ఎత్తుగడలను ముందే గుర్తించి ఆ నేరాలను అరికట్టే ప్రణాళిక రచించి, అందుకు అవసరమయ్యే శిక్షణ పొందుతున్నందునే తెలంగాణ పోలీసుకు జాతీయ స్థాయి గుర్తింపు ఉందని ముఖ్యమంత్రి అన్నారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌తో మన ఉత్పత్తులు విదేశాలకు, విదేశీ ఉత్పత్తులు మన దేశానికి వస్తున్నట్లే, నేరగాళ్లు సైతం విదేశాల నుంచే ఇక్కడ నేరాలకు పాల్పడుతున్నారని, వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. పోరాటాలతో ఏర్పడిన తెలంగాణలో పదేళ్లలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. సింగరేణి కాలనీలో ఒక బాధితుని కుటుంబాన్ని, ఔటర్ రింగు రోడ్డులో ఒక బాధితుడైన డాక్టర్‌ను పరామర్శించడానికి వెళితే వారంతా గంజాయికు అలవాటైన వారి వలనే తాము బాధితులుగా మరినట్లు తెలిపారన్నారు. తమ పిల్లలు కార్పొరేట్ స్కూళ్లకు వెళుతున్నారని, తాము రూ.వందల కోట్లు సంపాదించినా ఉపయోగం లేకుండాపోయిందని, తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని పలువురు తల్లిదండ్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం పోలీసు వ్యవస్థ రాజకీయ నిఘాపై శ్రద్ధ పెట్టి నేరగాళ్లను వదిలివేయడమేనని ముఖ్యమంత్రి అన్నారు.
- మితిమీరిన భద్రత వద్దు…
రాజకీయ వ్యవస్థపై నిఘా తగ్గించి నేరాలపై నిఘా పెట్టి నేరగాళ్లను పట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సమాజంలో ఉన్న ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజా ప్రతినిధులుగా వచ్చామని, తమకు మితిమీరిన సెక్యూరిటీ అవసరం లేదని, ఎవరికి ఎంత అవసరమో అంతే సెక్యూరిటీ ఇవ్వాలని, భద్రత విషయంలో తనతో సహా ఎవరికీ అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని డీజీపికి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భద్రత, ఇతర విషయాల్లో కొన్ని సార్లు పోలీసుల అతి ఉత్సాహం చూపుతారని, ఆ ఉత్సాహం, శక్తి నేరాల నియంత్రణపై చూపాలని ముఖ్యమంత్రి హితవు పలికారు. పోలీసు కుటుంబాల పిల్లలు రాణించలేరనే అపవాదు సమాజంలో ఉందని, ఇందుక ప్రధాన కారణం విధుల్లో పడి కుటుంబాలకు, పిల్లలకు సరైన సమయం కేటాయించకపోవడమే కారణమని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే సైనిక స్కూళ్ల మాదిరే పోలీసు పిల్లల కోసం పోలీసు స్కూళ్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. గ్రేహౌండ్స్‌కు చెందిన 50 ఎకరాల స్థలంలో పోలీసు స్కూల్ ఏర్పాటు చేస్తామని, ఆరు నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందులో ఉంటుందని, హోంగార్డు నుంచి డీజీపీ పిల్లల వరకు చదువుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. సామర్థ్యం, పని తీరుతోనే బదిలీలు కోరుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సామర్థ్యం ఉన్నవారిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందని, అందుకు సందీప్ శాండిల్య ఉదాహారణ, తన ప్రభుత్వంలో రిటైర్ అయిన వారిని పదవీ కాలం పొడిగించిందని ఒక్క సందీప్ శాండిల్యకేననే విషయం గుర్తుంచుకోవాలన్నారు. - నేను పోలీసు కుటుంబం నుంచే వచ్చా….
పోలీసుల పిల్లలు తాము పోలీసుల కుటుంబాల నుంచి వచ్చామని చెప్పుకునేందుకు ఇబ్బంది పడతారని, అందుకు కారణం పోలీసు శాఖపై సమాజంలో ఉన్న అభిప్రాయమేనని ముఖ్యమంత్రి అన్నారు. ఆ అభిప్రాయం మారాలని, తన తండ్రి, తన అన్న పోలీసు అని గర్వంగా చెప్పుకునేలా మన ప్రవర్తన ఉండాలని ఆయన సూచించారు. తన అన్న భూపాల్ రెడ్డి వనపర్తిలో కానిస్టేబుల్ గా పని చేసి తనను చదివించారని, తన అన్న పెంపకంతోనే తాను ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చానని ఆయన వెల్లడించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోలీసు శాఖ సమస్యలు పరిష్కరించుకోకుంటే జీవితకాలంలో అవి పరిష్కారం కావన్నారు. తాను జడ్పీటీసీ సభ్యునిగా ఉన్నప్పుడు పోలీసు అధికారులంటే ఒక గౌరవం, భయం ఉండేదని, క్రమంగా అది పడిపోయిందని, దానిని పునరుద్ధరించేలా ప్రయత్నించాలని సూచించారు. నేరాల నియంత్రణలో ఎస్‌హెచ్‌వోలే కీలక పాత్ర అని, పైఅధికారుల పని పర్యవేక్షణ మాత్రమేనని, ఈ విషయం గుర్తించి పోలీసులకు వన్నెతెచ్చేలా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
- తెలంగాణ బ్రాండ్ హైదరాబాద్..
తెలంగాణ బ్రాండే హైదరాబాద్ అని, హైదరాబాద్ పోలీసు అంటే తెలంగాణకు గుండెకాయ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలో నేరాలను నియంత్రించకపోతే, అరాచకాలను అరికట్టకపోతే రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని మఖ్యమంత్రి అన్నారు. పోలీసులు అంతా తమ బాధ్యతను ప్రతి రోజు గుర్తుపెట్టుకొని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని కాపాడాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ బి.శివధర్‌రెడ్డి, టీజీ న్యాబ్ డీజీ సందీప్ శాండిల్య, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, హైదరాబాద్, సైబారాబాద్, రాచకొండ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, అవినాష్ మహంతి, తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు.