జి.వెంకటస్వామి (కాకా) 95వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ హాజరయ్యారు. తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా ఒకరని, గతంలో ఉన్నవారు కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూశారో.. లేక ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయాలనుకున్నారో తెలియదని రేవంత్ ఆరోపించారు. కాకా జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేయాలని నేను అధికారులను ఆదేశించినట్టు వివరించారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరుగున పడకూడదని కాకా సోనియమ్మను ఒప్పించారని గుర్తు చేసిన సీఎం రేవంత్, ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు ఆనాడు ఎన్నికల్లో గెలిచేందుకు కాకా సహకారం తీసుకున్నారని చెప్పారు రేవంత్. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జయంతిని అధికారికంగా జరపకుండా విస్మరించారని సీఎం ఆరోపించారు.
కాకా పేదల మనిషి,పేదోళ్ల ధైర్యం..
80వేల మందికి పైగా నిరుపేదలకు ఇండ్లు ఇప్పించిన ఘనత కాకాది అన్న రేవంత్, ఆనాడు సింగరేణి సంస్థను కాపాడి కార్మికులకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి కాకా అన్నారు. జాతీయ స్థాయిలో నెహ్రూ ను చాచా అని పిలిస్తే.. రాష్ట్రంలో గడ్డం వెంకటస్వామిని కాకా అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకుంటారని, జాతీయ కాంగ్రెస్ కార్యాలయానికి తన ఇంటిని ఇచ్చేసిన కాంగ్రెస్ వాది కాకా అన్నారు.
కాకా ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉంది..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కాకా కుటుంబ సభ్యుల పాత్ర క్రియాశీలకంగా ఉండాలన్నది పార్టీ ఆలోచన అన్న ముఖ్యమంత్రి, మూసీ పరివాహక ప్రాంతాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాన్నారు. ప్రభుత్వం మిమ్మల్ని అనాథలను చేయదు.. మీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదని, మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దు… ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుందన్నారు. ఫామ్ హౌస్ లను కాపాడుకునేందుకు పేదల ముసుగు అడ్డుపెట్టుకునే వారి మాటలు వినొద్దని రేవంత్ వివరించారు.
ఈ వేదికగా పేదలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా..
మీ మంచి కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురికావద్దని రేవంత్ భరోసా ఇచ్చారు. మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉందని, ఈటెల, కేటీఆర్, హరీష్ కు సూచన చేస్తున్నా.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వండని సీఎం అన్నారు.
మా ప్రభుత్వానికి ఎవరిపై కోపం లేదు..
ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ఎజెండానే మాదన్న సీఎం రేవంత్, నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారన్నారు. మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి? కాకా స్పూర్తితో పేదలకు మెరుగైన వసతులు కల్పిద్దామని, కేసీఆర్, కేటీఆర్ కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్ లో కొంత భూమిని పేదలకు దానం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. మీరు ఫామ్ హౌజుల్లో జమీందారుల్లా బతుకుతారు… పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా? అని రేవంత్ నిలదీశారు.
అవసరమైతే మలక్ పేట్ రేస్ కోర్టును, అంబర్ పేట్ పోలీస్ ఆకాడమీని హైదరాబాద్ బయటకు తరలించి పేదలకు ఇండ్లు కట్టిద్దామని, పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రండి అని సీఎం రేవంత్ అన్నారు. మీ ఆస్తులు ఇవ్వకపోయినా పరవాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండన్న రేవంత్, ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదన్నారు. ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం రూ.11వేల కోట్లు.. నెలరోజుల్లో మేం రూ.18వేల కోట్లు రైతు రుణమాఫీ చేసామని వివరించే ప్రయత్నం చేశారు.
దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు, సమస్య ఉంటే కలెక్టర్ ను కలవండి..
సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయమని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు.