AWS investment in Telangana : తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. టెక్ దిగ్గజం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయి, రాష్ట్రంలో తమ కార్యకలాపాల విస్తరణపై కీలక చర్చలు జరిపింది.
విస్తరణకు సంపూర్ణ సహకారరం : మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏడబ్ల్యూఎస్ బృందం సమావేశమైంది. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కెర్రీ పర్సన్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని తదితరులు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ల ప్రాజెక్టు పనులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై వారు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ఏడబ్ల్యూఎస్ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. “మీరు మరిన్ని పెట్టుబడులతో ముందుకు రండి.. మీకు కావాల్సిన సంపూర్ణ మద్దతు, సహకారం అందించే బాధ్యత మాది” అని ముఖ్యమంత్రి వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు. పారిశ్రామిక ప్రగతికి, యువతకు ఉపాధి కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
జర్మనీ బృందంతోనూ భేటీ.. పెట్టుబడులకు ఆహ్వానం : ఇదే క్రమంలో, జర్మనీకి చెందిన పారిశ్రామిక బృందం కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయింది. హైదరాబాద్‌లో తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ని ప్రారంభిస్తున్నట్లు వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన సీఎం, హైదరాబాద్‌ను ఓ ‘ఇన్నోవేషన్ హబ్’గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవకాశాలను ఆయన వారికి వివరించి, ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.


