CM Revanth Reddy: హైదరాబాద్ నగరంలో అకస్మాత్తుగా కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదల సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. మారిన వాతావరణ పరిస్థితుల వల్లే పలు నగరాల్లో, హైదరాబాద్‌లోనూ ఈ అస్తవ్యస్త వాతావరణం నెలకొందని ఆయన పేర్కొన్నారు. నగరంలో కేవలం 2 సెం.మీ వర్షం పడినా వ్యవస్థ అస్తవ్యస్తమవుతోందని, వరద నీటిని నియంత్రించేందుకు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
బతుకమ్మకుంట పునరుద్ధరణ: సీఎం చేతుల మీదుగా ప్రారంభం
ఈ సందర్భంగా, రంగారెడ్డి జిల్లా అంబర్‌పేటలోని 14.16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బతుకమ్మకుంటను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కబ్జాకు గురైన ఈ కుంటలో ఆక్రమణలను తొలగించి, రూ. 7.15 కోట్ల వ్యయంతో చెరువును పునరుద్ధరించిన హైదరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ (హైడ్రా) ను ఆయన అభినందించారు. కుంట వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు.
హైడ్రాపై విమర్శలు సహజం: మూసీ కబ్జాపై ఆవేదన
“హైడ్రా ఆలోచన చేసినప్పుడు ప్రారంభంలో నన్ను విమర్శించారు. ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టినప్పుడు విమర్శలు సహజం” అని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు చెరువులు, మూసీ నది గొప్ప వరం అని, కానీ, ఈ వనరులు కబ్జాకు గురై వరద సమస్య పెరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ అంటే.. మురికికూపం అన్నట్లుగా మారిందని విమర్శించారు.
నాగార్జున కన్వెన్షన్ హాల్‌పై సీఎం కామెంట్స్
చెరువుల కబ్జా విషయంలో రాజకీయాలకు అతీతంగా స్పందించిన సీఎం, హైటెక్ సిటీ ప్రాంతంలోని తుమ్మడికుంట ఆక్రమణ గురికావడాన్ని ఉదహరించారు. సినీ నటుడు నాగార్జున ప్రస్తావన తెస్తూ, “తెలిసో.. తెలియకో.. హీరో నాగార్జున చెరువున్న భూమిలో కన్వెన్షన్ హాల్ కట్టారు. హైడ్రా కూల్చిన తర్వాత, వివరాలు చెప్పిన తర్వాత నాగార్జున వాస్తవం గ్రహించారు” అని తెలిపారు. పేదల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నామని, తమ ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని సీఎం కోరారు.


