తెలంగాణ రాష్ట్రంలో రూ.1.80లక్షల కోట్లు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. దావోస్‌లో రాష్ట్రానికి పెట్టుబడుల అంశంపై మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్టుబడులు పెట్టేందుకు ముందకొచ్చిన కంపెనీలకు ధన్యవాదాలు తెలిపారు. విదేశీ పెట్టుబడుల కోసం తన బృందంతో కలిసి దావోస్ వెళ్లామని తెలిపారు. తమ ప్రభుత్వంలో ఇదే అతి పెద్ద విజయం అని స్పష్టం చేశారు.
దిగ్గజ కంపెనీలకు కావాల్సిన భూములు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. తెలంగాణ భవిష్యత్‌లో అత్యంత ఆదాయం కలిగిన రాష్ట్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సింగపూర్‌లో పదో తరగతి చదివిన తర్వాత విద్యార్ధులను సాంకేతిక నైపుణ్యంలో నిష్ణాతులైన వారిగా రూపొందిస్తున్న సంస్థతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. తెలంగాణ-సింగపూర్ ప్రభుత్వాలు కలిసి పని చేయాలని నిర్ణయించామని రేవంత్ వెల్లడించారు.అయితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
ఇక మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) మాట్లాడుతూ..ముఖ్యమంత్రి, మంత్రివర్గంపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంపై 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం జరగగా.. ఇప్పుడు నాలుగు రెట్లు అధికంగా ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన, నిరుద్యోగుల నైపుణ్యం పెంచే అంశాలపై సింగపూర్ మంత్రులతో చర్చించామన్నారు. నిరుద్యోగుల్లో నైపుణ్యం పెంపొందించాలని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.