తెలంగాణ జానపద కళాకారుడు పస్తం మొగిలయ్య(Balagam Mogilaiah) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బేడ బుడగ జంగాల జానపద కళారూపం ‘శారద కథల’కు బహుళ ప్రాచుర్యం కల్పించి, ఆ కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య శారద తంబుర మీటుతూ, పక్కనే బుర్ర(డక్కీ) వాయిస్తూ వారి సతీమణి కొమురమ్మ పలు చోట్ల ఇచ్చిన అనేక ప్రదర్శనలు వెలకట్టలేనివని అన్నారు. తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టిన బలగం సినిమా చివర్లో వచ్చే మొగిలయ్య పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని గుర్తుచేశారు. ఈ బాధాకర సమయంలో పస్తం మొగిలయ్య సతీమణి కొమురమ్మతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.