Sunday, November 16, 2025
HomeతెలంగాణCM Revanth Reddy: తొలి మహిళా డ్రైవర్ సరితకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

CM Revanth Reddy: తొలి మహిళా డ్రైవర్ సరితకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

CM Revanth Reddy Congratulates Sarita: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా సరిత అనే యువతి నియమితులైన సంగతి తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సిత్య తండాకు చెందిన వి.సరిత ఢిల్లీలోని రవాణా సంస్థలో గత పదేళ్లుగా డ్రైవర్‌గా విధులు నిర్వహించారు. అయితే తన కుటుంబం కోసం స్వస్థలంలోనే పనిచేయాలనే ఉద్దేశంతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన పొన్నం.. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి జీఎంబీ సంస్థ నుంచి మిర్యాలగూడ డ్రైవర్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆమె మంత్రి పొన్నంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

తాజాగా సరితకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈమేరకు సీఎంవో కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా చేరిన వాంకుడోతు సరిత అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని సీఎం ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరితకు ఆయన అభినందనలు తెలియజేశారు.

ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో మహిళా డ్రైవర్ నియామకం కీలక ముందడుగు అని పేర్కొన్నారు. మహిళలు విద్య, విజ్ఞానం, వృత్తి, వ్యాపారం, క్రీడలు, సైన్యం వంటి అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని చెప్పారు. గృహ బాధ్యతలు, సమాజ నిర్మాణంలోనూ మహిళల పాత్ర అపూర్వమైనదిగా తెలిపారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ, అడ్డంకులను అధిగమించి మహిళలు విజయాల బాటలో ముందుకెళ్తున్నారని, ఈ సందర్భంలో సరిత అందరి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని సీఎం అభినందించారు.

ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని గుర్తుచేశారు. కోటి మందిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధన కోసం ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad